86) అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ .. కథ
---------------------------------------
అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ.. - కథ
~~~~~~~~~
✍️ హరీష్ బాబు
లేడీస్ అండ్ జెంటిల్మన్ ప్లీజ్ జాయిన్ యువర్ హాండ్స్ .. అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టూ... ప్రకాష్..
ఎందుకో ఏమో కానీ..
ఈ శబ్దం నిరంతరం ప్రకాష్ మెదడు లో ధ్వనిస్తూ ఉండేది
ప్రకాష్ ఒక సాధారణ కాలేజీ విద్యార్థి. తన ప్రతిభను నిరూపించుకోవాలని ఎన్నో ఆశలతో పోటీల్లో పాల్గొనేవాడు. కానీ విధి అతన్ని ప్రతిసారి వెక్కిరించింది.
ఒక సారి కాలేజీలో జరిగిన క్విజ్ పోటీలో ప్రకాష్ బృందం ప్రథమ బహుమతి సాధించింది.
తన ఇంట్లో పేరెంట్స్ తో గప్పగా చెప్పుకున్నాడు.. బహుమతి తీసుకోబోతున్నట్టుగా.. కానీ మొదటి నుంచి చిన్న చూపు చూసే అమ్మ నాన్న ఇతనికి అంత ఉందా అన్నట్టు చూసారు
గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న అతని ఇద్దరి పేరెంట్స్ కళ్ళకి ఎప్పుడూ చుట్టూ పక్కల ఉండే వారి పిల్లలే గొప్పగా కనిపించే..వారు ఎప్పుడు ఆ బయట వారి పిల్లల తో పోల్చడం వాళ్ళ కి అన్నీ ప్రైజెస్ వచ్చాయి నీకేమి రావా అని.. ఎగతాళి గా మాట్లాడటం.. చాలా అవమానంగా అనిపించేది ప్రకాష్ కు
స్టేజ్ మీద అనౌన్స్‌మెంట్ కోసం అతను ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాడు.. కానీ అతను చూస్తుండగా, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు 'ఎన్. ప్రకాష్' అని పిలవడానికి బదులు 'ఆర్. ప్రకాష్' అని పిలిచారు. ఆ చిన్న పొరపాటు వల్ల తన కష్టానికి దక్కాల్సిన గుర్తింపు దక్కక ప్రకాష్ కన్నీళ్లతో ఇంటికి వెనుతిరిగాడు. ఆ గ్రూపులో ఉన్న ' ఆర్. ప్రకాష్ ' ఆ ప్రైజ్ తీసుకున్నాడు.. మరి నా పేరు ఇంకా పిలవలేదు ఏంటి అని వెయిటింగ్ చేస్తూనే ఉన్నాడు కానీ అలా చూస్తూనే ఆ 'సెరేమోనీ' మొత్తం అయిపోయింది.. ఇంటికి వొట్టి చేతులతో వచ్చాడు..
"నా పేరు పలకడానికి కూడా ఈ ప్రపంచానికి మనసు రావడం లేదేంటి? అక్షరం మారింది కానీ నా కష్టం మారలేదు కదా!ఒక జట్టు లో ఇద్దరూ ఒకే పేరుతో ఉంటే ఒక పేరే ఎందుకు చదివారు ఇంకో పేరు చదవలేదు .... అందరూ నవ్వుతూ షీల్డ్ పట్టుకుంటుంటే, నేను మాత్రం..కేవలం నా పేరు చదవక పోవటం వల్ల వెనుక దాక్కోవాల్సి వచ్చిందే. నా దురదృష్టం ముందే రాసిపెట్టినట్టు ఎందుకు విధి నాపై ఇంత కసిగా ఉంది?"
కాలేజ్ ప్రోగ్రాం అయ్యాక ఇంటికి వట్టి చేతులు తో వచ్చిన అబ్బాయి చూసి తమలో తామే నవ్వుకున్నారు అతని పేరెంట్స్
---
ఇంకోక సారి ఒక నాటకంలో అద్భుతంగా నటించి మొదటి బహుమతికి ఎంపికయ్యాడు. తీరా బహుమతి తీసుకునే సమయానికి, నిర్వాహకులు ఆ తన పేరు ఉన్న షీల్డ్ ఎక్కడో కనపడకుండా పోయిందని, తర్వాత రేపు ఆఫీసులో ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలేజీ వారు తను గుర్తు చేసినా ఆ విషయాన్నే మర్చిపోయారు.
పోనీలే అప్పుడంటే అక్షరం మారింది అనుకున్నాను, ఈసారి ప్రైజ్ యే మారిపోయింది. నా నటనకు చప్పట్లు కొట్టిన చేతులు , బహుమతి ఇచ్చేటప్పుడు ఖాళీగా చూపిస్తున్నాయి. 'తర్వాత ఇస్తాం' అన్న ఒక్క మాట ఒక మనిషిని ఎంత క్రుంగ దీస్తుందో నా మనసుకే తెలుసు. బహుమతి గెలిచినా ఒక ఓడిపోయిన వాడిలా తలదించుకుని వెళ్లాల్సి వస్తోందే.. ఇది నా తలరాతా ఏమిటీ ?" అనుకున్నాడు.. కాలేజీ ఎచ్.ఓ.డి కి కంప్లైంట్ చేద్దామా అనుకున్నాడు... మనలో సత్తా ఉండాలి కానీ ఎవరిని అని ఏం లాభం మిగతా అందరూ బాగానే బహుమతి అందుకుంటున్నపుడు నాకు మాత్రమే ఇవ్వక పోవటానికి వారి ఆంతర్యం ఏమిటో గోచరించట్లేదు.. అనుకున్నాడు
మళ్ళీ వట్టి చేతులతో.. వచ్చిన అబ్బాయి ని చూసి.. కాస్త వెటకారం గా అతని వెనుక మళ్ళీ నవ్వారు తల్లి తండ్రులు...
-----
ఒకసారి పాటల పోటీలో 2nd ప్రైజ్ తెచ్చుకున్నాడు.. కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజూ ఎంతకీ తన పేరు రాలేదు అని ఆ నిర్వాహకుడిని అడిగితే , అసలు లిస్టులోనే అతని పేరు లేదని బ్యాక్‌స్టేజ్ సిబ్బంది తేల్చిచెప్పారు.
ప్రతిసారి కాలేజీలో గెలిచానని ఇంట్లో గొప్పగా చెప్పుకోవడం, తీరా బహుమతి లేకుండా ఖాళీ చేతులతో వెళ్లడంతో తల్లిదండ్రులు అతన్ని నమ్మలేదు. "నువ్వు అబద్ధాలు చెబుతున్నావు" అని గేలి చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు.
విషయం ఏదైనా అయ్యుండచ్చు కానీ కన్నా తల్లి తండ్రులు చులకన చేయటం.. అతనికి మింగుడు పడలేదు..
తను పోటీలో పాల్గొనటం నిజం.. గెలిచింది నిజం.. బహుమతి ఇవ్వక పోవటం నిజం..
ఒకరిని నమ్మించాలసిన అవసరం నాకు లేదు అనుకున్నాడు
ఒక అంతర్ముఖుడైన వ్యక్తికి తనను తాను సమర్థించుకోవడం, వేరే వారితో వాదించటం కంటే తనలో తాను మదనపడటమే ఎక్కువ ఇష్టపడతాడు . ప్రకాష్ స్థితి కూడా సరిగ్గా అదే.
"నేను గెలిచాను అన్న సంతోషం కంటే, నా వాళ్ళు నన్ను నమ్మడం లేదన్న బాధే నన్ను ఎక్కువగా దహించివేస్తోంది. బయట ప్రపంచం నన్ను గుర్తించకపోవడం ఒక ఎత్తు అయితే, కన్నతల్లిదండ్రులు నన్ను ఒక అబద్ధాలకోరులా చూడటం మరింత బాధిస్తోంది ."
"నేను నిజమే చెబుతున్నాను అని గొంతు చించుకుని అరిచి చెప్పాలని ఉంది. కానీ, ఆ గొడవ చేసే శక్తి నా దగ్గర లేదు. నా మౌనాన్ని వాళ్ళు అసమర్థత అనుకుంటున్నారు. గెలిచిన వాడిలా తలెత్తుకుని తిరగాల్సిన నేను, దొంగలా తలదించుకుని తిరుగుతున్నాను. నా కష్టం వారికి కనిపించడం లేదు, కేవలం ఆ చేతిలో ఉండాల్సిన బహుమతి మాత్రమే చూస్తున్నారు ."
"సరే! ఇక ఎవరినీ నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రపంచానికి నా గెలుపు ఒక పత్రమో, ఒక షీల్డో అయితే... అవి నా దగ్గర ఉండాలి. ఆ కష్టం నాది, ఆ ప్రతిభ నాది. గుర్తింపు ఇవ్వడం కాలేజీ బాధ్యత, కానీ అది వారు చేయనప్పుడు నా గుర్తింపును నేనే గౌరవించుకుంటాను."
ఒక రోజు ప్రకాష్ తన దగ్గరున్న... దగ్గరలో ఉన్న గిఫ్ట్ షాప్ వైపు నడక సాగించాడు.
ఆ డబ్బుతో ఆ గిఫ్ట్ షాపులో " మూడు షీల్డ్స్" కొనుక్కున్నాడు.
తన కష్టానికి ప్రతిఫలం కాలేజీ ఇవ్వకపోయినా, అది తన హక్కే అని భావించి తన పేరు మీద ఆ మొమెంటోలను షోకేసులో పెట్టుకున్నాడు. అది తప్పో ఒప్పో అతనికి తెలియదు కానీ, ఆ క్షణం ఆ షీల్డ్స్ చూస్తుంటే ప్రకాష్‌కు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చాయి.
ఆ షీల్డ్స్ కేవలం చెక్క బొమ్మలు కావు, అతని కష్టానికి అతను ఇచ్చుకున్న గౌరవం.
తల్లిదండ్రుల ఎగతాళికి జవాబు చెప్పకుండా, తన గదిలోననే ఆ షీల్డ్స్ ని అమర్చుకున్నాడు..
ప్రకాష్ తనను తాను ఓదార్చుకోవడానికి ఎంచుకున్న ఆ మార్గం ఇది. ఇది తప్పో ఒప్పో తెలీదు.
అతని మానసిక స్థితికి మాత్రం ఒక ఔషధంలా పనిచేసింది. తనూ ఎప్పుడు భాద గా ఫీల్ అయ్యినా ఆ షీల్డ్స్ ని చూసినప్పుడు ఆ భాధ తొలగి పోతుంది.. ధైర్యం వస్తుంది.. తాను కూడా లైఫ్ లో ఏదయినా సాధిస్తాను అనే నమ్మకం కలుగుతుంది.. ఇది ఒక తెరపి లాంటిది...
-- సమాప్తం ---
-- సమాప్తం --
No comments:
Post a Comment