88 ) ఖరీదైన స్నేహం
~~~~~~~~~~~~~~~~~~
- హరీష్ బాబు
"ఒరేయ్ దరహాస్ .. ఆ ఆల్టో కార్ కాస్త నేర్చుకోరా .. ఎటు అయినా వెళ్ళడానికి ఉపయోగ పడ్తుంది " అంటూ బ్రతిమాలు తున్నారు రాఘవయ్యగారు తన కొడుకు దరహాస్ ని.
ఆరు అంతస్తుల కట్టడాలపై సర్కస్ లాగా బ్యాలెన్స్ చేస్తూ .. చేస్తూ , అరవై ఏళ్ల పాటు కన్స్ట్రక్షన్ సూపర్‌వైజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు రాఘవయ్య గారు. ఆయన జీవితకాలపు కష్టార్జితం, రూపాయి రూపాయి కూడబెట్టిన పొదుపుతో తన కుటుంబం కోసం ఒక సరికొత్త మారుతి ఆల్టో కారును కొన్నారు. అది ఆయనకు కేవలం ఒక వాహనం కాదు, ఆయన నలభై ఏళ్ల కష్టానికి ప్రతీక.
కానీ వయసు పైబడటం, డ్రైవింగ్ అంటే కాస్త భయం వేయడంతో రాఘవయ్య గారు తన కొడుకు దరహాస్‌ను పిలిచి,
"నాన్నా, ఈ కారు డ్రైవింగ్ నా వల్ల కాదు రా ... నువ్వు డ్రైవింగ్ నేర్చుకుని నన్ను తిప్పాలి " అని చెప్పారు.
తండ్రి కల నెరవేర్చడం కోసం దరహాస్ వెంటనే ఒక డ్రైవింగ్ స్కూల్‌లో చేరి లైసెన్స్ తీసుకున్నాడు. తండ్రి కారును రోడ్డు మీదకి తెచ్చే ధైర్యం చాలక, తన కాలేజీ రోజుల్లో మంచి స్నేహితుడైన చైతన్యను సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు.
కాలేజీ రోజుల్లో చాలా స్నేహపూర్వకంగా ఉండే చైతన్య, ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ప్రతి దాంట్లోనూ లాభనష్టాలు బేరీజు వేసే స్వార్థపరుడిగా తయారయ్యాడు.
అయినప్పటికీ, దరహాస్ మొహమాటంగానే అడిగాడు—"రోజుకి కేవలం పది నిమిషాలు నా పక్కన కూర్చుని డ్రైవింగ్ సరిగ్గా వచ్చేలా సాయం చేయరా" అని.
అయితే, దరహాస్ చైతన్య ఒప్పుకోడెమో ఒప్పుకున్నా నాకేంటి అంటాడేమో అనుకున్నాడు . కానీ ఊహకు విరుద్ధంగా చైతన్య ఒప్పుకున్నాడు. పేచీలు కోండిషన్లు పెట్టకుండానే సరే అన్నాడు . అంతేకాదు, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వరుసగా నాలుగు రోజుల పాటు రోజూ సాయంత్రం దరహాస్ వెంటే ఉండి డ్రైవింగ్ నేర్పించాడు. ఇది చూసి దరహాస్ ఆశ్చర్యపోయాడు.
" నాకోసం నిస్వార్థంగా సాయం చేస్తున్నాడే చైతన్య.. నేనే తప్పుగా అర్దం చేసుకున్నానా ఏంటి " అనుకుంటూ మనసులో చైతన్యను అభినందించుకున్నాడు.
రోజులు గడిచాయి. చైతన్య చేసిన సహాయానికి దరహాస్ ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు.
సరిగ్గా నెల రోజుల తర్వాత, ఒక రోజు సాయంత్రం దరహాస్ కు చైతన్య నుండి ఫోన్ కాల్ వచ్చింది.
చైతన్య: "హలో దరహాస్! ఎలా ఉన్నావు?"
దరహాస్: "బాగున్నాను చైతన్య! నువ్వు ఎలా ఉన్నావు? అంబాసిడర్ జాబ్ ఎలా నడుస్తోంది?"
చైతన్య: "అంతా బాగానే ఉంది రా. అసలు విషయం ఏంటంటే... ఈ వీకెండ్‌లో నేను మా సొంతూరికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఒక చిన్న రోడ్డు ట్రిప్ ప్లాన్ చేశాను."
దరహాస్: "ఓహో, మంచిదే కదా! ట్రిప్ ఎప్పుడు? ఎవరెవరు వెళ్తున్నారు?"
చైతన్య: "అదేలే... అది కాదు దరహాస్. నేను సొంతూరికి బైక్ మీద వెళ్లలేను కదా . క్యాబ్ లు కూడా ట్రై చేశాను దొరకలేదు .. అందుకే నీకు ఫోన్ చేశాను ... మీరు కొత్తగా తీసుకున్నారు కదా, ఆ ఆల్టో కారుని నాకు ఒక మూడు రోజులు ఇస్తావా? సొంతూరికి వెళ్లి, తిరిగిచ్చేస్తాను."
ఆ మాట విన్న దరహాస్ ఒక్కక్షణం షాక్‌తో నిశ్చేష్టుడయ్యాడు. కేవలం నాలుగు రోజులు, రోజుకి పది నిమిషాలు పక్కన కూర్చుని సహాయం చేసినందుకు... తన తండ్రి జీవితకాలపు కష్టార్జితపు కల, మూడు లక్షల విలువైన ఆల్టో కారును ఏకంగా 300 కిలోమీటర్ల దూరానికి మూడు రోజులు ఎలా అడుగుతున్నాడు? అని మనసులో మదనపడ్డాడు. కేవలం కొద్ది రోజుల చిన్న సహాయానికి ఇంత పెద్ద ప్రతిఫలాన్ని ఆశిస్తున్న చైతన్య స్వార్థపూరిత మనస్తత్వం దరహాస్‌కు అర్థమైంది.
తక్షణమే తేరుకుని, ఎంతో సౌమ్యంగా కానీ గట్టిగా ఇలా సమాధానం ఇచ్చాడు:
" చైతన్య, ఏమీ అనుకోకు భాయ్. నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించినప్పుడు సాయం చేశావు, ఆ కృతజ్ఞత ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. కానీ... ఇది కేవలం నా ఒక్కడి కారు కాదురా. మా నాన్న అరవై ఏళ్ల పాటు ఎండ అనక, వాన అనక కట్టడాల మీద కష్టపడి, తన జీవితకాలపు సంపాదన అంతా కూడబెట్టి కొనుక్కున్న ముద్దుల కారు ఇది.
మా కుటుంబం మొత్తానికి ఇదొక పవిత్రమైన కల. దీన్ని బయటకు ఎవరికైనా ఇవ్వాలంటే మా నాన్న అస్సలు ఒప్పుకోరు;
ఆ ఆలోచనే ఆయనకు గుండెకోత లాంటిది. రేపు ఏదైనా చిన్న గీత పడ్డా, ఏ చిన్న ఇబ్బంది జరిగినా నాన్న తట్టుకోలేరు. అందుకే ప్లీజ్... నా పరిస్థితిని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను .. ప్లీజ్ డోంట్ మైండ్."."
అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు.
లోకం లో చైతన్య లాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట అనుకున్నాడు . పది రూపాయాలకి వంద రూపాయలు అడుగు పరవాలేదు కానీ పడికి లక్ష అడగటం అంటే మీ గాడ్ .. !!
-- సమాప్తం --