Wednesday, June 24, 2026

49) గాలిలో కలిసిన గర్వం**.. కథ

 Story 



**గాలిలో కలిసిన గర్వం**.. కథ 


✍️ Harish babu 


హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఆ విమానంలో రాఘవరావు అనే ఒక వృద్ధుడు కిటికీ పక్క సీటులో కూర్చుని ఉన్నాడు. ఆయన వేషధారణ చాలా సాధారణంగా ఉంది—మడతలు పడిన పాత కాటన్ చొక్కా, పక్కనే కాళ్ళ దగ్గర ఒక చిన్న సంచీ.

అతని పక్క సీటులో విక్రమ్ సేథి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూర్చున్నాడు. ఖరీదైన సూటు, చేతిలో లెదర్ బ్రీఫ్‌కేస్. విమానం టేకాఫ్ అయినప్పటి నుండి విక్రమ్ తన ఫోన్‌లో బిజినెస్ డీల్స్ గురించి గట్టిగా మాట్లాడుకుంటూ, పక్కనే ఉన్న రాఘవరావును చులకనగా చూస్తూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

"నిజంగా అర్థం కావడం లేదు! విమానయాన సంస్థల ప్రమాణాలు ఎంత పడిపోయాయో చూడండి. ఇలాంటి పేదవాళ్ళని కూడా విమానాల్లో ఎందుకు అనుమతిస్తారో? ఈ సీట్లు ఎంత ఇరుగ్గా ఉన్నాయో.. కనీసం కాలు చాచుకుందామన్నా పక్కన ఎవరో ఒకరు అడ్డుగా కూర్చుని ఉంటారు," అని విక్రమ్ విమర్శించసాగాడు.

రాఘవరావు ప్రశాంతంగా విక్రమ్ వైపు తిరిగి, "బాబు, నీ పేరు ఏమిటి? హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటావు? నీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏం చేస్తున్నారు?" అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు.

విక్రమ్ చిరాగ్గా, "నా పేరు విక్రమ్. జూబ్లీహిల్స్‌లో ఉంటాను. నా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. అంతా నా వ్యాపార హోదా వల్లనే," అని గర్వంగా చెప్పాడు. రాఘవరావు చిరునవ్వుతో, "చాలా సంతోషం బాబు. నీ వ్యాపారం ఏమిటి?" అని అడిగాడు.

"నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. పెద్ద పెద్ద కమ్యూనిటీలు కడతాను," అని విక్రమ్ విర్రవీగాడు. రాఘవరావు తల పంకించి, "మంచిదే కానీ, నీ వెంచర్ల కోసం చాలా చెట్లను నరికేస్తుంటావు కదా?" అని అడిగాడు.

విక్రమ్ ఎగతాళిగా నవ్వి, "అవును, అందులో తప్పేముంది? నా దగ్గర అత్యాధునిక యంత్రాలు ఉన్నాయి. నా మనుషులు ఒక్క రోజులో వంద చెట్లను నేలమట్టం చేస్తారు. డెవలప్‌మెంట్ కావాలంటే ఇవన్నీ తప్పవు!" అన్నాడు.

రాఘవరావు మాట తీరులో ఏ మాత్రం అసహనం లేకుండా, "ఒక్క రోజులో వంద చెట్లను నరకడం చాలా సులభమే బాబు. కానీ, ఒక్క చిన్న మొక్కను పెద్ద వృక్షంగా మార్చడానికి ముప్పై ఏళ్ల కష్టం కావాలి, అది నీకు తెలుసా?" అని నిదానంగా అన్నాడు.

విక్రమ్ కోపంగా, "ఏమిటి నీ ఉచిత సలహాలు? వ్యాపారంలో ఇవన్నీ సహజం!" అని గట్టిగా అరిచాడు. రాఘవరావు ఏ మాత్రం తగ్గకుండా, "వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు బాబు. ఈ చెట్లు మన ఆర్థిక వ్యవస్థకు, మన భవిష్యత్ తరాలకు, పర్యావరణానికి చాలా అవసరం. ఒక చెట్టును నరికావంటే, దానికి ప్రతిఫలంగా పది మొక్కలు నాటి, అవి కనీసం మూడేళ్లు బతికేలా జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే మన పిల్లలకి మనం మంచి భవిష్యత్తును ఇస్తాం," అని సున్నితంగా మందలించాడు. విక్రమ్ మాత్రం, "చాలా అయింది నీ సోది! నా లైఫ్ స్టైల్ వేరు, నా ఆలోచనలు వేరు," అంటూ ముఖం తిప్పేసుకున్నాడు.

విమానం ఢిల్లీలో దిగింది. విక్రమ్ అందరికంటే ముందు బయటపడాలని హడావిడి చేస్తున్నాడు. కానీ, విమానం తలుపులు తీయగానే అక్కడ దృశ్యం చూసి విక్రమ్ నోరు వెళ్లబెట్టాడు. పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది సెల్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ తను ఏదో పెద్ద సెలబ్రిటీ అనుకుని ముందుకు వెళ్లబోయాడు. కానీ, ఆ అధికారులు అతన్ని పక్కకు నెట్టి, రాఘవరావు దగ్గరకు వచ్చి అత్యంత గౌరవంగా సెల్యూట్ చేశారు.

"సార్, మీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం, రండి," అని అధికారులు వినయంగా చెప్పారు. విక్రమ్ ఆశ్చర్యపోయి, "అతను ఒక సామాన్యుడు కదా, అతనికి ఎందుకు ఇంత గౌరవం?" అని అడిగాడు.

అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ అధికారి విక్రమ్ వైపు తిరిగి, "ఇతను సామాన్యుడు కాదు సార్. ఇతని పేరు రాఘవరావు. అడవి మనిషి (ఫారెస్ట్ మ్యాన్) అని పిలుస్తారు. లక్షకు పైగా మొక్కలను నాటి, ఎడారిలా ఉన్న భూమిని పచ్చని అడవిగా మార్చినందుకు భారత ప్రభుత్వం ఈరోజు ఆయనకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని అందజేయబోతోంది," అని చెప్పాడు.

విక్రమ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. రాఘవరావు ఆ అధికారిని అనుసరిస్తూ వెళ్తూ, వెనుతిరిగి విక్రమ్ వైపు చూసి చిన్నగా నవ్వి, "చూడు బాబు, విమానంలో ఫస్ట్ క్లాస్‌లో ఎవరు కూర్చున్నారనేది చెట్లకు తెలియదు. మనం వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద ఏం వదిలి వెళ్తున్నామనేదే ముఖ్యం," అని చెప్పి తన దారిలో వెళ్ళిపోయాడు. తన అజ్ఞానానికి, అహంకారానికి విక్రమ్ సిగ్గుపడి తలదించుకున్నాడు.


Sunday, June 14, 2026

48 ) మరో జీవితం.. కథ

 48 ) మరో జీవితం.. కథ 

--------

✍️హరీష్ బాబు 

--------- telugu story 


రాత్రి ఎనిమిది అయ్యింది. 

గౌరీ , రాధాకృష్ణ ఇద్దరు భోజనానికి కూర్చున్నారు.  

గిన్నెలు చుస్తే అన్నము, కూర ఖాళీ గా కనిపించాయి... 


" అయ్యో చెప్పటం మరిచా అత్తయ్యా! కూరాలన్నీ అయిపోయాయి.. మీరు కొంచం పెరుగుతో కానిస్తారా ఇవాళ ... " అంటూ లోపలి నుంచి చెప్పింది కోడలు శారద


ఇద్దరు తెల్ల మొహాలు వేశారు.. 

"కొంచం ముందే చెపితే.. గుడ్డు అయినా చేసే దానిని కదా.." అనుకుంది గౌరి 


ఈ నెల లో ఇలా చేయటం నాలుగో సారి..

ఇద్దరు ఖాళీ కడుపు తోటే పడుకున్నారు.. 

పొద్దునే వాకింగ్ నెపం తో బయటపడ్డారు.. 


దారిలో గౌరీ అంది


"ఏంటండీ మనకి ఈ ఖర్మ... మీ పెన్షన్ డబ్బు అంతా ఇద్దరికీ ఇచ్చేయద్దు అంటే విన్నారు కాదు..

ఉన్న ఇల్లు కూడా అమ్మించేసారు.. 

కనీసం ఒక మనసులో మాట ఏదయినా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు...ఆరునెల్లు ఆ కొడుకు దగ్గర.. ఆరునెలలు ఈ కొడుకు దగ్గరా ఉండటం ఇంకా నా వల్ల కావటం లేదండి.. " 


"అదే నేను ఆలోచిస్తున్నా.." అంటూ ఏదో ద్యాస లో నడుస్తూ ఉన్నారు.. రాధాకృష్ణ 


ఇంతలో ఎవరో వెనకాలనుంచి

 "సార్.. " అంటూ పిలిచారు 


"సార్ మీరు కృష్ణ సార్ కదా...నన్ను గుర్తు పట్టారా... నేను అన్వర్ ని సార్... గుంటూరులో మీ దగ్గరే చదువుకున్నాను.. " అన్నాడు 


"ఓహ్ అవునా..చాలా కాలం అయింది కదా బాబు.. బాగున్నావా బాబు.. 

ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావ్.. ఏమి చేస్తున్నావ్.." అడిగారు రాధాకృష్ణ గారు 


"ఏమో సార్ అప్పుడు చదువు అబ్బలేదు.. టెన్త్ అయ్యాక హైదరాబాద్ వచ్చేసాను.. చిన్న హోటల్స్ లో సర్వర్ గా చేసాను.. ఇప్పుడు సొంతంగా ఏమైనా స్టార్ట్ చేదామని అనుకుంటున్నాను.. డబ్బు లేదు.. ఎలాగా అని ఆలోచిస్తున్నాను..


 " మంచిది.. నాయనా చాలా మంచి ఆలోచన..నీ నెంబర్ ఇవ్వు సండే కాల్ చేస్తాను.. రాగలవా " 


"తప్పకుండా సార్ ఉంటాను సార్ " అంటూ వెళ్లి పోయాడు.. 


ఆలోచన లో పడ్డాడు రాధాకృష్ణ.. గౌరి మౌనంగా చూస్తూ నడుస్తోంది... 


......


గౌరి ఈయన వ్యవహారం అంతా గమనిస్తూ ఉంది 


ఆదివారం రోజు సాయంత్రం.. రాధాకృష్ణ గారు అన్వర్ కి ఫోన్ చేసి ఎక్కడో కలవమన్నారు.. 


... 


నెల తరువాత ఒక రోజు ప్రొద్దున.. 

పెద్ద కోడలు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉత్తరం చూసి షాక్ అయ్యింది... 


" మేము ఇద్దరం ఇల్లు వదిలి వెళ్తున్నాం..

ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాం... మీ క్షేమం కోరే.. 

 మీ అమ్మ నాన్న " 


అని ఉత్తరం సారాంశం.. 


ఇది జరిగి నాలుగేళ్లు అయింది 

.... 

అది విజయవాడ నేషనల్ హైవే...

హైదరాబాద్ కి 40 km దూరం లో 

రోడ్ పక్కన ఒక పెద్ద బోర్డు..

" గౌరీ టిఫిన్స్ అండ్ ధాబా.. 

వెజ్ అండ్ నాన్ వెజ్ "


ఒక రోజు అటుగా వెళ్తున్న... 

రాధాకృష్ణ పెద్దకొడుకు శ్రీధర్ ఫ్యామిలీ.. 

ఆ ధాబా లో ఆగి టిఫిన్ ఇర్డర్ చేశారు... 


అక్కడ చూస్తే.. ఉన్నది అమ్మ నాన్న... 


శ్రీధర్... రాధాకృష్ణ గారిని బిల్లింగ్ కౌంటర్ లో చూస్తూనే... 


"నాన్న... ఎక్కడ వెళ్లి పోయారు నాన్నా ఇన్ని రోజులు.. మిమ్మల్ని వెదకని చోటంటూ లేదు.. రండి నాన్న ఇంటికి వెళదాం.. " అన్నాడు..


రాధాకృష్ణ గారు అతన్ని చూస్తూ... 

" ఎవరు బాబు మీరు... ఎప్పుడు చూడలేదు... 

ఏ టిఫిన్ కావాలో చెప్పండి.. పంపిస్తాను.. " అన్నాడు...


శ్రీధర్ కి మతి పోయింది..... అక్కడి నుంచి వెళ్లి పోయాడు... 


ఆ మరుసటి రోజు... పొద్దున్నే నిద్ర లేచి తలుపు తీశారు.. రాధాకృష్ణ..   


ఇంటి ముందు ఉన్న ఇద్దరు కొడుకులని చూసి షాక్ అయ్యాడు... 


అలాగే వారిని పట్టించుకోకుండా... తన పని తాను చూసుకుని.. తొమ్మిది ఇంటికి.. భార్యతో కలిసి హోటల్ కు బయలుదేరుతున్నారు .. 


ఇంతలో శ్రీధర్ మళ్ళీ నాన్నకి అడ్డు పడి

" ఏంటి నాన్న గుర్తు పట్టనట్టు చేస్తున్నారు "అని అడిగాడు 


దానికి రాధాకృష్ణ గారు అన్నారు .. 


" అయ్యో మేము ఇప్పుడు మర్చిపోయామా బాబు.. మీరు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు కదరా... 

ఇపుడు కూడా మీరు ఎందుకు వచ్చారు అంటే ఇంత పెద్ద హోటల్ ఉంది.. ఎంత సంపాయించారో ఏమో మళ్ళీ పంచుకుందాం అనుకుని వచ్చారు అంతేనా ... ఇందులో పూచిక పుల్ల కూడా మాది కాదు లేదు ... అంతా అన్వర్ దే.. 

నిజంగా చెప్పండ్రా... ఒకవేళ ఇదే రోజు మమ్మల్ని మీరు ఏ గుడి దగ్గరో మేము బిచ్చమ్ ఎత్తుకుంటే.. నువ్వు ఆగే వాడివిరా... ఇలాగే ఇంటికి రమ్మని అనేవాడివా లేక గుర్తు పట్టనట్టు వెళ్లిపోయే వాడివా.. మమ్మల్ని గుర్తు పట్టలేదు అని తెగ బాధ పడిపోతున్నావు...పోండి రా.. పోయి పని చూసుకోండి.. " 


"గౌరీ త్వరగా రా హోటల్ టైమ్ అవుతోంది.." అంటూ ఇంటికి తాళం వేసి ఇద్దరూ కారులో ఎక్కగా .. అన్వర్ హోటల్ వైపు కి కారుని పోనిచ్చాడు... 


.. ( సమాప్తం ) 


. కథ


47) "మెడల్ ".. కథ

47 ) "మెడల్ ".. కథ

-------------------------


15jun 26

✍️ హరీష్ బాబు

"కవితా నా కంపెనీ డాకుమెంట్స్ ఉన్న ఫైల్ ఎక్కడ పెట్టావు" అంటూ పిలిచాడు ఆనంద్

"ఆ వస్తున్నా.. " అంటూ కిచెన్ నుండి బెడ్ రూమ్ కు వెళుతూ

" పొద్దున్నే ఈయనకు కంపెనీ డాకుమెంట్స్ తో పనేంటో " అనుకుంటూ వెళ్ళింది కవిత..

"ఇదిగో ఈ షెల్ఫ్ లోనే ఉన్నాయి కదా.. "అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది..

"ఓహ్ ఇక్కడే ఉన్నాయా..థాంక్స్ . ఆ కొత్త కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇవ్వాలంటే పాత కంపెనీ డాకుమెంట్స్ పంపామన్నారు లే ఆ పని లో ఉన్నా..నువ్వెళ్లు నేను చూస్తా లే."

సరే అంటూ మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళింది కవిత..

ఆ ఫైల్ తెరిచి ఒక్కొక్కటి డాకుమెంట్స్ తీస్తుంటే ఒక మెడల్ కింద పడింది.. ఏమిటా అని చూస్తే..

అది తాను డిగ్రీ చదివే రోజులు యూనివర్సిటీ లెవెల్ లో మొట్టమొదటి సారి చిత్రాలేఖనం లో తీసుకున్న మొదటి బహుమతి తాలూకా జ్ఞాపకం...

కింద నుంచి తీసి ఒక్క సారి ఆ మెడల్ చూస్తూ.. జ్ఞాపకల్లోకి వెళ్ళాడు ఆనంద్ .. రోజులు గర్రున వెనక్కి తిరిగాయి..

*****

అవి ఆనంద్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు.. 

ఆనంద్ స్వతహాగా ముభావంగా ఉండే ఇంట్రోవర్ట్( అంతర్ముకుడు ) కూడా కావటం చేత తన భావాలను ఎక్కువగా ఎవరికీ వ్యక్తపరిచేవాడు కాదు.. ఒకవేళ వ్యక్త పరిచినా తన భావాలు నెగటివ్ గా ఉన్నాయి అని ఎవరైనా అంటే తీసుకోలేక పోయేవాడు

 అలాగే.. కోలేజ్ లో ఎప్పుడైనా.. ఏదయినా ఫేర్ వెల్ డే, ఆగష్టు 15, jan 26, ఆన్యువల్ డే లాంటి స్పెషల్ డేస్ జరిగిన నాడు అక్కడ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు మొహం బాధగా పెట్టేసేవాడు.. కారణం తను ఎందులోనూ ఎంపిక అవ్వకపోవటమే..

తనకి డాన్స్ రాదు, స్పోర్ట్స్ రావు, పాటలు రావు,.. కాస్తో కుస్తో యాక్టింగ్(నటన ) అయితే చేయగలడు... కానీ ఇప్పుడు డ్రామా సెక్షన్ కాలేజ్ వాళ్ళు తీసేసారు అట ... అంతా డాన్స్ అంటే గెంతులు పాటలు అంటే అరుపులే ఇప్పడు ట్రెండ్.... కదా..అందుచేత మిగతా రోజులు బాగానే ఉండేవాడు కానీ ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడే కాస్త దిగాలు ఉండేవాడు.

తను ఎందులోనూ లేనప్పుడు ఇక అక్కడకు వెళ్లి మాత్రం ఏమిచేయాలి అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళేవాడు కాదు.. ఎప్పటికైనా తను కూడా ఏదో ఒక కళ లో... మంచి ప్రైజ్ తో ...అందరిని సర్ ప్రైజ్... చేయాలనీ ఉభలాట పడ్తుండేవాడు 

అదిగో అలాంటి అప్పుడే ఒక రోజు పొద్దున్నే కాలేజ్ మెట్లు ఎక్కుతుండగా ఆ నోటిస్ కనిపించింది

"యూనివర్సిటీ లెవెల్ పెయింటింగ్ కాంపిటీషన్" ( చిత్రాలేఖనం పోటీలు ).

అది చూస్తూనే మనసులో దాదాపు ఎగిరి గంతేసాడు ఆనంద్.

ఆ వెంటనే తన పేరు నమోదు చేసేసాడు.

ఎదురు చూస్తున్న.. ఆ పోటీ రోజు రానే వచ్చింది. ఇంట్లో అమ్మను అడిగి ఖర్చులకు వంద రూపాయలు తీసుకుని ఆ నోటిస్ లో ఇచ్చిన యూనివర్సిటీ అడ్రస్ కి బయలుదేరాడు. ఆ స్టాప్ కి అయితే బస్సు దిగాడు కానీ ఆ చెప్పిన బిల్డింగ్ కాస్త కన్ఫ్యూషన్ గా ఉండి చాలా మందిని అడుగుతూ అడుగుతూ వెళ్లాల్సి వచ్చింది. మెయిన్ రోడ్డు నుంచి దగ్గరే అయినా బస్సు స్టాండ్ నుంచీ పది నిముషాలు పట్టింది. మిట్ట మద్యాహ్నం ఎండ మండి పోతుంది. గబా గబా నడుస్తూ చెమట్లు కక్కుతూ వెళ్ళాడు.

తనతో పాటు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండేది అనిపించింది ...ఆ బిల్డింగ్ ముందు బోర్డు చూసాడు 


చిత్రాలేఖన పోటీ మధ్యాహ్నం రెండింటికి అని రాసి ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. 

టాపిక్ : "మత సామరస్యం"

పర్వాలేదు తెలిసిన టాపిక్ ఏ కదా అనుకున్నాడు..

తనతో పాటు తెచ్చిన పెన్సిల్స్, పెయింట్స్ అన్ని సరి చూసుకున్నాడు.

సమయం రెండు అయింది.. పోటీ నీర్వహించే హాల్ లోకి వెళ్ళాడు.. పోటీ రెడీ అన్నారు

.. కానీ షాక్ ఏంటి అంటే

"డ్రాయింగ్ పేపర్స్ ఇవ్వటం లేదు ఎవరి పేపర్స్ వారే తెచ్చుకోవాలి " అని చెప్పారు

అదేంటి అని అడిగితే అది అంతే అన్నారు.. ఇప్పుడు ఏమిటీ చేయటం.. ఆ బిల్డింగ్ చుట్టూ ఏ కాలనీ లేదు.. కనీసం నాలుగు ఐదు కి. మీ. వెళితే కానీ ఏమి దొరకవు..

రాయి లాగా అక్కడే నిలబడి పోయాడు..

తన ఆశలు ఆవిరి అయిపోయినట్టు కనిపించాయి...

పాజిటివ్ గా ఆలోచించాలి.. అనుకున్నాడు..

తోటి వాళ్ళను అడిగాడు.. ఎవరు కూడా ఎక్సట్రా షీట్స్ లేవు అని చెప్పారు...

మరీ ఏమిటి చేయటం.. ఏ మహానుభావుడో వచ్చి వెనకాల భుజం తట్టి ఇదిగో తీసుకో అంటే బాగున్ను అనుకున్నాడు .. కానీ అలా జరగలేదు..

ఆలోచనతో సమయం మించి పోతుంది..

అమ్మ ఇచ్చిన వంద రూపాయలు తీసి చూసుకున్నాడు

చిన్న కాలిక్యులేషన్ (లెక్క ) చేసాడు.. పోటీ కి 90 మినిట్స్ సమయం ఇస్తారు..

నేను ఇపుడు రోడ్ వరకు వెళ్ళటానికి 15 నిముషాలు, షాప్ కి 15 నిముషాలు, రావటానికి 15 నిముషాలు = టోటల్ 45 నిముషాలు..

పోగా ఇంకా 45 నిముషాలు ఉంటాయి.. నాకు సరిపోతుంది..

తప్పదు ఒక చిన్న గాంబుల్ చేయాలి.. ఇంకో దారి లేదు అని తన పరిస్థితి ని ఇన్విజిలేటర్ కి వివరించి . అంతా తను అనుకున్నట్టే జరుగుతుంది అనే నమ్మకం తో.. గేట్ వైపు నడిచాడు..

నడుస్తూ ఉంటే అమ్మ చెప్పిన మాట గుర్తు కు వచ్చింది

"గెలుస్తాను అనే నమ్మకం తో నీ ప్రయత్నం నువ్వు చేయి.. ఈ ప్రపంచం ఏ నీకు సహాయం చేస్తుంది.. " అని

రోడ్ చేరుకోగానే అటు ఇటు చూస్తే ఒక్క ఆటో కూడా లేదు.. ఒకే ఒక్క ఆటో దూరం నుంచి వస్తోంది... ఆపినా ఆగలేదు.. కానీ ఏమి ఆలోచించాడో తెలీదు ఆటో డ్రైవర్ దూరం వెళ్లి ఆగి రమ్మన్నాడు..

అతని దగ్గరకు వెళ్లి నా పరిస్థితి వివరించాను...

దానికి అతను

"నేను పొద్దుట్నుంచి ఏమి తిన లేదు బాబు .. దాదాపు రెండున్నర కావస్తుంది.. పర్వాలేదు లే బాబు ఎక్కు దింపేస్తాలే" అన్నాడు

సమయం గర్రున తిరుగుతోంది...

చెప్పిన సమయం లోపల తిరిగి వస్తానో లేదో అని టెన్షన్ పడ్తున్నాడు లోలోపల

కానీ.. వెళ్ళటం పేపర్స్ తీసుకోవటం, వచ్చేయటం అన్ని అనుకున్నట్టుగానే 45 నిమిషాల్లో జరిగి పోయాయి..

ఇన్విజిలాటర్ కూడా లేట్ అయినా ఆలోవ్ చేసాడు.. తక్కువ సమయం ఉన్నా కూడా బొమ్మ బాగానే వచ్చింది.. ఇన్విటేటర్ కి ఇచ్చేసి ఇంటికి వచ్చాడు..

***

రెండు వారలు గాడిచాయ్.. ఒక మార్నింగ్ కాలేజ్ మెట్లు ఎక్కుతుంటే... అందరు తనని చూసి పలకరిస్తున్నారు... ఏంటా అని చూస్తే నోటిస్ బోర్డు లో తన పేరు ఫస్ట్ ప్రైజ్ (at university level) యూనివర్సిటీ స్థాయిలో మొదటి బహుమతి...ఆనంద్ అని తన ఫోటో తో సహా ఉంది.. ఆనంద్ కళ్ళలో నీళ్లు నిండాయి.. తన కల నిజమైంది.. తను కూడా ఇపుడు ఒక స్టార్..

మరుసటి రోజు.. యూనివ్వర్సిటీ వీసీ నుంచి మెడల్ తీసుకున్నాడు ఆనంద్..

అమ్మ మాట మళ్ళీ గుర్తు కి వచ్చింది...

"నువ్వు గట్టిగా కోరుకుంటే ప్రపంచం నీకు సహాయం చేస్తుంది "

---

మెడల్ చూస్తూ ముసి ముసి గా నవ్వుకుంటున్న ఆనంద్ ని చూసి భార్య కవిత

"ఏంటి ఆ మెడల్ చూసి ఏమి గుర్తొచ్చింది " అంది

"ఏమి లేదు లే " అంటూ ఫైల్ లో కి మెడల్ ని మళ్ళీ పెట్టేసాడు ఆనంద్

--- సమాప్తం ---


46 ) మౌనం లోని ప్రేమ ... కథ ---------

46 )  మౌనం లోని ప్రేమ ... కథ 


15jun2 026

--------------------------

✍️హరీష్ బాబు Harish Babu 


సుధాకర్ ఒక వర్ధమాన రచయిత. ప్రపంచాన్ని తన అక్షరాలతో చదవాలనుకునే వ్యక్తి.

ఇంగ్లీషులో ప్రావీణ్యం కోసం ఒక భాషా తరగతిలో చేరాడు. అతనికి అక్కడ రియా మాలిని అని ఒక అమ్మాయి చూసాడు . తను ఒక నర్సు గా పని చేస్తూ అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోటానికి వచ్చేది అని తెల్సుకొన్నాడు. ఆమె కళ్లు చాలా మాట్లాడతాయి కానీ, పెదవులు మాత్రం ఎప్పుడూ ముడుచుకునే ఉంటాయి. ఎవరితో ఎక్కువ పలికేది కాదు. 


    ఒకరోజు తరగతి విరామ సమయంలో సుధాకర్ ఆమె దగ్గరకు వెళ్లి,

 "హలో రియా గారు.. , నా పేరు సుధాకర్ నేను ఒక రైటర్ ని .. మీ పేరు ఎలా తెల్సు అని ఆశ్చర్య పోకండి.. మీరే కదా ఫస్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ చేసుకున్నారు స్టేజి మీద "... 


"ఓహ్ హాయ్.. క్లాస్ లేదా ఇవాళ " 

"కాస్త లేట్ అట సార్.. అవును ఇంతకీ..మీరు ఏమి జాబ్ చేస్తుంటారు..? "

 " నేను హాస్పిటల్ లో నర్స్ ని అండి.. "


"నర్సింగ్ అంటే చాలా సేవతో కూడుకున్న వృత్తి కదా.. మీకు రోగులను చూసుకోవడం ఇష్టమేనా?"

 అని అడిగాడు. 


ఆమె తల ఎత్తి ఒక్క క్షణం అతడిని చూసి, సమాధానం చెప్పకుండా మళ్ళీ తన నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది. 


ఆమె మౌనం కాస్త ఇబ్బంది పెట్టినా సుధాకర్‌కి కి ఆవిడ ఒక అంతుచిక్కని నవలలా అనిపించింది.


ప్రతీరోజు ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేసేవాడు. మాటల్లో ఆమె తన ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది అని తెలుసుకున్నాడు. 

   ఒకసారి రియా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్తూ అడ్రస్ కనుక్కోటానికి ఇబ్బంది పడుతుంటే సుధాకర్ స్వయంగా తోడుండి ఆమెను ఆఫీస్ వరకు తీసుకెళ్లాడు. 

     

   దారిలో సుధాకర్ ఉత్సాహంగా, 

"రియా గారు, ఈ ఏరియా అంతా నాకు బాగా తెలుసు. మీకు ఇక్కడ జాబ్ వస్తే ట్రావెలింగ్ చాలా ఈజీ అవుతుంది. భయపడకండి, ఇంటర్వ్యూ బాగా చేయండి అల్ ది బెస్ట్ " అని ధైర్యం చెప్పాడు. 


   తీరా ఆఫీస్ దగ్గరకు రాగానే, ఆమె ఒక చిన్న 'థాంక్స్' కూడా చెప్పకుండా కేవలం తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. సుధాకర్ ఆశ్చర్యపోయాడు అయినా, 


  " ఏమో పాపం.. ఇంటర్వ్యూ టెన్షన్‌లో ఉండి ఉంటుందిలే" అని ఆమె ప్రవర్తనను అమాయకత్వంగా భావించి నవ్వుకున్నాడు.


   కొన్ని రోజుల తర్వాత, ఆమె తన ఊరికి వెళ్లడానికి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేయలేక ఇబ్బంది పడుతుండటం గమనించాడు , మళ్ళీ సుధాకరే దగ్గరుండి అన్నీ పూర్తి చేసి ఇచ్చాడు 


. "రియా గారు, ఇదిగోండి మీ కన్ఫర్మ్డ్ టికెట్. విండో సీటు వచ్చేలా చూశాను, జర్నీ ఎంజాయ్ చేయండి. వెళ్ళాక ఒకసారి ఈ అబాగ్యుడికి ఒక మెసేజ్ చేయండి," అన్నాడు ఆశగా.


    కానీ ఆ సమయంలోనూ ఆమె మౌనంగానే ఉంది. ఆ టికెట్ అందుకుని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


     చివరికి ఇంకోసారి తన స్నేహితులకి వీకెండ్లో బర్త్డే పార్టీ కోసం సరుకులు కొనడానికి అని రమ్మంది. వెళ్లినప్పుడు కూడా సుధాకర్ ఏదో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ మళ్ళీ అదే మౌనం. ఆమెకు భారీ సంచులు మోస్తూ ఆమె ఇంటి వరకు తీసుకొచ్చి సాయం చేశాడు.


 "అబ్బో! చాలా సరుకులు కొన్నారుగా.. పార్టీ పెద్దదే అనుకుంటా? మీ ఫ్రెండ్స్‌కి మీ వంట అంటే ఇష్టమా?" అని నవ్వుతూ పలకరించాడు. 


   కానీ రియా వైపు నుండి స్నేహం వైపు నుండి ప్రతిస్పందన గా ఒక్క అడుగు కూడా పడలేదు. సంచులు లోపల పెట్టి తలుపు వేసే వరకు ఆమె కనీసం అతని వైపు చూసి నవ్వు కూడా నవ్వలేదు కూడా. ప్రతిసారీ ఆమె ఒక అపరిచితురాలిలాగే ప్రవర్తించేది.


    ఇక విసుగు పుట్టిన సుధాకర్ బాధగా ఒకరోజు తన రూమ్ లో ఉండగా తన ప్రాణ స్నేహితుడు కృష్ణతో వచ్చాడు. విషయం ఏంటి అడగగా తన బాధను పంచుకున్నాడు. 


"రేయ్ కృష్ణ, నేను చేసిన సాయం తీసుకుంటుంది కానీ, కనీసం నేను మనిషిని అని కూడా గుర్తించదు.

అసలు తిట్టుకుంటుందా, ఎగతాలా,కోపమా, అసహ్యమా, ఇష్టమా ఏది తెలియదు రా అవసరానికి రమ్మంటుంది పనయ్యాక పొమ్మంటుంది. అంతా మౌనమే.. ఆ మౌనం వెనుక అర్థం ఏంటిరా ?" అని అడిగాడు.


కృష్ణ చాలా సేపు నిశ్శబ్దంగా విన్నాడు. 

అంతా విని ఇలా అన్నాడు: 


"సుధాకర్ ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకు.. ఆడవాళ్ల మౌనానికి చాలా అర్థాలు ఉంటాయి. తను నీ సాయం తీసుకుంటూ కూడా మాట్లాడట్లేదంటే దాని అర్థం..

 'దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకు, నాకూ కాస్త దూరంగా ఉండు ' అని. అది ఆమె నిశ్శబ్ద హెచ్చరిక ఏమో ."


ఆ మాట సుధాకర్ కళ్ళు తెరిపించింది. తన ఉనికి ఆమెకు భారం అనిపించినప్పుడు అక్కడ ఉండటం వ్యర్థమని గ్రహించాడు, వెంటనే తన మకాంను వేరే కాలనీకి మార్చేశాడు. కనీసం తను వెళ్తున్న విషయం కూడా ఆమెతో చెప్పలేదు. 


కొన్ని వారాల తర్వాత, రియాకు సుధాకర్ తో మళ్ళీ ఒక అత్యవసరమైన పని పడింది. మునుపటిలాగే క్లాస్ లో చూసింది, కానీ అక్కడ సుధాకర్ సీటు ఖాళీగా ఉంది. ఆ తర్వాత రెండు మూడు రోజులు గడిచినా అతను రాలేదు. 


    మొదటిసారి రియా మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. తను పిలవకపోయినా పలకరించే గొంతు వినిపించకపోయేసరికి ఆ నిశ్శబ్దం ఆమెను భయపెట్టింది.


ఆమె ఎలాగోలా సుధాకర్ పాత ఇంటి చిరునామా వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఇంటి యజమానిని కలిసి, "ఇక్కడ సుధాకర్ అని ఒక రచయిత ఉండేవారు.. ఆయన ఏరి?" అని అడిగింది.


    ఆ యజమాని బదులిస్తూ, "ఆయన ఇక్కడ ఉండటం లేదు ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. 

తన సామాన్లన్నీ సర్దుకుని వెళ్తూ వెళ్తూ 


'ఈ ఊర్లో నా అక్షరాలు ఎవరికీ అర్థం కావడం లేదు, అందుకే కొత్త చోటుకి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలకి అర్ధం నాకు తెలీలేదు . ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికీ చెప్పలేదు," అన్నాడు గేట్ వేసుకుంటూ .


   రియా ఆ ఇంటి గేటు దగ్గరే ఆ రూమ్ డోర్ వైపు చూస్తూ అలా నిలబడిపోయింది. అప్పుడు ఆమెకు కృష్ణ గుర్తుకు రాలేదు కానీ, సుధాకర్ పలకరింపులు మాత్రం చెవుల్లో మారుమోగాయి.


"రియా గారు, ఈ హాస్పిటల్ మీకు నచ్చుతుంది..." "రియా గారు, మీ టికెట్ వచ్చేసింది..." 

"రియా గారు, పార్టీ బాగా చేసుకోండి..."


   అతను ఆమె 'మౌనం' కి అర్ధం 'దూరం' అనుకుంటాడని ఆమె ఊహించలేదు. నిజానికి ఆమెకు మాట్లాడటం రాక కాదు, అతని మంచితనం చూసి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. 

   ఆ ఎక్కడికి వెళ్తాడు లే అన్న నిర్లక్ష్యం లో తమ క్లాస్ కేవలం రెండు నెలలే అన్న విషయం మర్చిపోయింది. 

 నిజమే తన నిశ్శబ్దం నిర్లక్ష్యం గా మారి ఒక మంచి స్నేహాన్ని చిదిమేసింది.


(మిగతాది పార్ట్ - 2 లో ) 


మౌనం లోని ప్రేమ

(లాస్ట్ పార్ట్ - 2 ) 


**** ***** ****


ఆమె చేతిలో ఉన్న పాత ఫోన్ నంబర్‌కి డయల్ చేసింది. కానీ అటువైపు నుండి "ఈ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేదు" అన్న సమాధానం మాత్రమే వచ్చింది. ఒక రచయిత తన కథలో అనవసరమైన పాత్రలను తొలగించినట్టుగా, సుధాకర్ ఆమె జీవితం నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు. రియా మాలిని ఇప్పుడు నర్స్ గా అందరి రోగాలను నయం చేస్తోంది కానీ, తన మౌనం వల్ల కలిగిన ఆ మనసు గాయాన్ని మాత్రం మాన్పుకోలేకపోయింది.


------------


మౌనానికి మరో రూపం - త్యాగం

కొన్ని నెలల తర్వాత...


అంబులెన్సు కూత తో హాస్పిటల్ మర్మోగుతోంది.. 

రియా మాలిని పనిచేస్తున్న హాస్పిటల్ లోకి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. స్ట్రెచర్ మీద రక్తపు మడుగులో ఒక వ్యక్తి అడ్మిట్ చేస్తున్నారు.. అటుగా వెళ్తున్న రియా స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తిని చూడగానే గుండె ఆగినంత పనైంది. 

అతను ఎవరో కాదు... సుధాకర్. పక్కనే అతని ఫ్రెండ్ కృష్ణ.. కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.


   ఐసీయూ లో ఊపిరి పీల్చుకుంటున్న సుధాకర్ ను బయట డోర్ అద్దాల లో నుంచి చూస్తూ కృష్ణను కలిసి అసలు ఏం జరిగిందో అడిగింది రియా.


  "హాయ్.. నా పేరు రియా .. అతనికి మీరేమవుతారు.. ఎలా జరిగింది ఇదంతా.. " 


   "ఓహ్ రియా మీరా.. రోడ్డు ప్రమాదం మేడం .. చాలా రక్తం పోయింది. తను కోలుకోవాలంటే అర్జెంట్‌గా ఓ నెగటివ్ గ్రూప్ బ్లడ్ కావాలి, ఎక్కడా దొరకడం లేదు" అని కృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు


.ఏమాత్రం ఆలోచించకుండా రియా , "నాది అదే బ్లడ్ గ్రూప్.. నా రక్తం తీసుకోండి" అని ముందుకు వచ్చింది రియా.


   సుధాకర్ కోలుకోవడానికి పట్టిన ఆ 24 గంటలు రియా అసలు కనురెప్ప వేయలేదు. నర్సుగా తన డ్యూటీ మాత్రమే కాదు, ఒక స్నేహితురాలిగా అతనికి ప్రాణం పోసింది.


   కానీ, ఆమె కృష్ణతో ఒక మాట చెప్పింది:

 "కృష్ణ గారు, సుధాకర్ కి నేను ఎవరో చెప్పకండి. నేను సాయం చేశానని తెలిస్తే అతను మళ్ళీ నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. తను కోలుకుని వెళ్ళిపోయే వరకు నా పేరు తెలియనివ్వకండి. అడిగితే నా పేరు మాలిని అని చెప్పండి "


కొన్ని రోజుల తర్వాత సుధాకర్ కోలుకున్నాడు. డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. కృష్ణ సాయంతో నడుచుకుంటూ హాస్పిటల్ కారిడార్ లో వెళ్తుంటే, రియా దూరం నుండి ఒక కర్టెన్ వెనుక నిలబడి తడి కళ్లతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతను క్షేమంగా తిరిగి వెళ్తున్నాడనే తృప్తి ఆమె మౌనంలో ఒక ప్రశాంతతను నింపింది.


బయటకు వెళ్తున్నప్పుడు సుధాకర్ ఆగి కృష్ణతో అన్నాడు, "కృష్ణ, ఎవరో నర్సు నాకు ప్రాణం పోశారట కదా.. రక్తం ఇచ్చి రాత్రంతా నిద్రలేకుండా చూసుకున్నారట. కనీసం థాంక్స్ చెప్పనివ్వు."


కృష్ణ నవ్వి, "ఆమె పేరు మాలిని. చాలా మంచి ఆవిడ. కానీ తను ఎవరితోనూ మాట్లాడదు సుధాకర్. తన సేవలోనే దైవత్వాన్ని వెతుక్కుంటుంది. నువ్వు తనకి థాంక్స్ చెప్పడం కంటే, క్షేమంగా ఇంటికి వెళ్లడమే ఆమెకు పెద్ద బహుమతి అని చెప్పమంది రా పైగా ఇవాళ డ్యూటీ అయిపోయింది.. పద వెళ్దాం.. " అన్నాడు.


సుధాకర్‌కు ఆ 'మాలిని' తనే అని తెలియదు. రియాకి మాత్రం తన మౌనం వెనుక ఉన్న ప్రేమని మాటల్లో చెప్పడం కంటే, ఇలా ప్రాణం పోసి నిరూపించుకోవడమే సరైనది అనిపించింది. ఆమె అక్షరాలు మౌనంగా ఉన్నా, ఆమె చేసిన సాయం సుధాకర్ ఊపిరిలో నిలిచిపోయింది.


------------


 - మధురమైన కలయిక 


సుధాకర్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ నర్సు 'మాలిని' చేసిన సేవ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈరోజుల్లో కూడా అలాంటి మనుషులు ఉంటారా.. తన రక్తం ఇవ్వటమే కాకుండా తను డిశ్చార్జ్ అయ్యే వరకు సేవ చేయటం అంటే మాములు విషయం కాదు.. 


   ఒకరోజు తన రూంలో.. పాత సామాన్లు సర్దుతుండగా, భాషా తరగతిలో రియా మర్చిపోయిన ఒక పుస్తకం అతని చేతికి చిక్కింది. దాని మొదటి పేజీ మీద "రియా మాలిని" అని రాసి ఉంది.


ఒక్కసారిగా సుధాకర్ మెదడులో మెరుపు మెరిసింది. "కృష్ణ చెప్పిన నర్సు పేరు మాలిని... ఈమె పేరు రియా మాలిని! అంటే నాకు ప్రాణం పోసింది ఆమేనా?" అని కృష్ణకు ఫోన్ చేసి నిలదీశాడు. 


కృష్ణ నిజం ఒప్పుకోక తప్పలేదు. వెంటనే సుధాకర్ హాస్పిటల్‌కు పరుగెత్తాడు. కానీ అక్కడి రిసెప్షన్ లో అతనికి ఒక చేదు వార్త వినిపించింది


. "మాలిని గారు ఆ ముందు రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత ఊరికి వెళ్ళిపోయారు" అని చెప్పారు.


సుధాకర్ వదిలిపెట్టలేదు. తన రచయిత మెదడుతో, అక్కడ రికార్డుల ద్వారా ఆమె అడ్రస్ సంపాదించాడు. అది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామం. రైలు, బస్సు, కారు అన్ని విధాలుగా ప్రయాణాలు చేసి చివరకు ఆ పచ్చని పొలాల మధ్య ఉన్న ఆ ఊరిలో ఆమె ఇంటిని చేరుకున్నాడు.


రియా ఇంటి ముందు చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. అకస్మాత్తుగా సుధాకర్‌ను చూడగానే ఆమె కళ్లలో ఆశ్చర్యం, సంతోషం ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది, కానీ ఈసారి ఆమె మౌనం "ఎందుకు వచ్చావు?" అని అనడం లేదు, "నీ కోసమే వేచి చూస్తున్నాను" అని చెబుతోంది.


సుధాకర్ ఆమె దగ్గరకు వెళ్లి, "నీ మౌనం వెనుక ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు రియా. నన్ను క్షమించు," అన్నాడు. రియా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం మాటల అవసరం లేకుండానే వారిద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు.


"ఇంకా మౌనమేనా మాట్లాడు అన్నాడు.. " 


"ఆమ్మో ఈ మౌనం తోనే నిన్ను పోగుట్టుకున్నాను.. ఇంక నుండి.. నా నోరు నిద్ర పోయే టప్పుడు తప్ప పలుకుతూనే ఉంటుంది.. నీ పేరే.. "


ఆ మౌన రాగం చివరకు ఒక అందమైన పెళ్లి పాటగా మారింది. సుధాకర్ అక్షరాలు, రియా సేవ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


 వారిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాటల మీద ఆధారపడాల్సిన అవసరం లేని మధురమైన బంధంలో ఉన్నారు.


*** శుభం ***



**** ***** ****

45 )+వింత కేసు.. కథ

 వింత కేసు.. కథ


15 jun 2026

✍️ హరీష్ బాబు 

============

రాజమండ్రి జిల్లా కోర్టులోని ఆ తేమతో కూడిన గాలిలో, సీలింగ్ ఫ్యాన్ కిర్రుకిర్రుమనే శబ్దం తప్ప కోర్టు హాల్‌ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ జడ్జి వెంకట్ రెడ్డి గారు తన కళ్ళజోడు పైనుంచి పిటిషనర్‌ వైపు ఆశ్చర్యంగా చూశారు.


జడ్జి గారు ఫైల్‌ను తిరగేస్తూ, "లాయర్ గారు, నేను చదువుతున్నది నిజమేనా? లేక టైపింగ్ మిస్టేక్ ఏమైనా జరిగిందా?" అని గంభీరంగా అడిగారు.

ఆ వింత పిటిషన్

లాయర్ సత్యనారాయణ గొంతు సవరించుకుని లేచి నిలబడ్డారు. ఆయన ముఖంలో ఎలాంటి తడబాటు లేదు.

"లేదు యువర్ ఆనర్, ఇది పొరపాటు కాదు," సత్యనారాయణ గారు ప్రకటించారు. "నా క్లయింట్ మురళీకృష్ణ, వయసు 31 ఏళ్లు, తన సోదరి కవిత నుండి 'శాశ్వత బంధ విచ్ఛేదన' (Permanent Civil Dissolution of Kinship) కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సామాన్య భాషలో చెప్పాలంటే యువర్ ఆనర్... అతను తన సొంత చెల్లెలి నుండి విడాకులు కోరుతున్నాడు."


31 ఏళ్ల మురళీకృష్ణ తన వయసు కంటే పదేళ్లు పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. కళ్ల కింద నల్లటి చారలు, ముఖంలో అంతులేని అలసట. అతనికి ఎదురుగా కూర్చున్న అతని సోదరి కవిత, ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా గోళ్లు సర్దుకుంటూ వెటకారంగా నవ్వుతోంది.


కోర్టు హాల్ ఒక్కసారిగా హోరెత్తింది. వెనుక వరుసలో ఉన్న జూనియర్ లాయర్లు నవ్వసాగారు. జడ్జి గారు సుత్తితో టేబుల్‌పై కొడుతూ అందరినీ నిశ్శబ్ద పరిచారు.

"లాయర్ గారు, పద్ధతిగా మాట్లాడండి!" జడ్జి గారు గదమాయించారు. "విడాకులు అనేది భార్యాభర్తల మధ్య జరిగే ఒప్పందాన్ని రద్దు చేసే ప్రక్రియ. హిందూ వివాహ చట్టంలో గానీ, వారసత్వ చట్టంలో గానీ తోడబుట్టిన వారి నుండి విడాకులు తీసుకునే నిబంధన ఎక్కడా లేదు. రక్త సంబంధాన్ని మీరు కాగితాల మీద రద్దు చేయలేరు."

మురళీ ఆవేదన

మురళీకృష్ణ వణుకుతున్న గొంతుతో లేచి నిలబడ్డాడు. "యువర్ ఆనర్, నాకు చట్టాలు తెలియవు. కానీ బాధ అంటే ఏంటో బాగా తెలుసు."


అతను ముందుకు వచ్చి, తన చెల్లెలి వైపు చూడకుండానే మాట్లాడటం మొదలుపెట్టాడు.

"భార్యాభర్తలు కలిసి ఉండలేనప్పుడు, ఒకరు మరొకరిని మానసిక హింసకు గురిచేస్తున్నప్పుడు, మీరు వారికి విడాకులు ఇస్తారు. ఒకరి జీవితంలోకి మరొకరు రాకూడదని 'రెస్ట్రైనింగ్ ఆర్డర్స్' ఇస్తారు. మరి అదే ప్రశాంతతను తోడబుట్టిన వారి విషయంలో ఎందుకు ఇవ్వరు?" అని ప్రశ్నించాడు.

విడాకుల వెనుక తర్కం

మురళీకృష్ణ కోర్టు హాల్ వైపు చూస్తూ తన పదేళ్ల వేదనను వెళ్లగక్కాడు.


 "యువర్ ఆనర్, పదిహేనేళ్లుగా నేను ఆమెకు అన్నను కాదు. ఆమె దృష్టిలో నేను కేవలం ఒక ఏటీఎం మిషన్ ని, ఒక పనివాడిని. ఆమె కోపతాపాలకు బలైపోయే ఒక వస్తువుని మాత్రమే."

 "ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం వల్ల ఒకరి ప్రాణాలకే ముప్పు ఉన్నప్పుడు లేదా ఒకరి జీవితం నాశనమవుతున్నప్పుడు చట్టం వారిని విడదీస్తుంది. మరి కేవలం 'రక్త సంబంధం' అనే ఒక్క కారణంతో, నన్ను నరకం చూపిస్తున్న వ్యక్తితో నేను ఎందుకు కలిసి ఉండాలి?"

 "నాకు ఒక స్వేచ్ఛ కావాలి. నాకు చెల్లెలు లేదని ఆ కాగితం చెప్పాలి. నా పేరు ఉపయోగించి ఆమె నా ఇంట్లోకి వచ్చి నా ప్రశాంతతను చెడగొట్టకుండా నాకు రక్షణ కావాలి. చనిపోయే వరకు ఆమె మొహం చూడకూడదనే హక్కు నాకు కావాలి."


కోర్టులో ఉత్కంఠ

కవిత తన గోళ్లు సర్దుకోవడం ఆపి, వెటకారంగా నవ్వింది. "వీడికి పిచ్చి పట్టింది జడ్జి గారు. వీడు ఎంత చేతకానివాడో చుట్టుపక్కల వాళ్లకి చెప్పానని ఇలా డ్రామాలు ఆడుతున్నాడు."


"నేను డ్రామాలు ఆడటం లేదు యువర్ ఆనర్," మురళీకృష్ణ జడ్జి కళ్లలోకి చూస్తూ నెమ్మదిగా అన్నాడు. "నేను చనిపోతున్నాను. ప్రతిరోజూ కొంచెం కొంచెం చనిపోతున్నాను. మీరు మమ్మల్ని చట్టబద్ధంగా విడదీయకపోతే, ఆమె నా ప్రాణాలు తీస్తుంది. ఒకే గర్భంలో పుట్టినందుకు నేను అనుభవిస్తున్న ఈ శిక్ష నుండి నాకు విముక్తి కావాలి."


జడ్జి గారు ఒకసారి మురళీ కళ్లలోని ఆవేదనను, మరోసారి కవిత ముఖంలోని నిర్లక్ష్యాన్ని చూశారు. చట్ట పుస్తకాల్లో ఇలాంటి కేసులకు ఆధారాలు లేవు, కానీ మురళీ కళ్లలో కనిపిస్తున్న ఆర్తిని ఆయన తోసిపుచ్చలేకపోయారు.

"ఈ కోర్టు," జడ్జి గారు గంభీరంగా అన్నారు, "ఆమె చేస్తున్న హింస ఏమిటో విన్న తర్వాతే ఈ కేసును విచారణకు స్వీకరించాలో లేదో నిర్ణయిస్తుంది. ఇది భారత న్యాయ చరిత్రలో ముందెన్నడూ లేని కేసు."


జడ్జి వెంకట్ రెడ్డి గారు తన కుర్చీలో వెనక్కి ఆనుకుని, మురళీ వైపు తీవ్రంగా చూశారు. "మురళీకృష్ణ, నువ్వు అడుగుతున్నది కేవలం భావోద్వేగమైన విషయం కాదు, ఇది చట్టాన్ని సవాలు చేసే అంశం. నీ సోదరి నిన్ను అంతగా ఏ విధంగా హింసించిందో, ఆ 'టార్చర్' ఏంటో ఈ కోర్టుకు వివరించు. చిన్నచిన్న గొడవలు తోడబుట్టిన వారి మధ్య సహజం కదా?"


మురళీ ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అతని కళ్లలో గతం ఒక పీడకలలా కదలాడింది.


"యువర్ ఆనర్, ఆ 'చిన్న చిన్న గొడవలే' నా ముప్పై ఏళ్ల జీవితాన్ని ఒక ఖైదులా మార్చేశాయి," మురళీ నెమ్మదిగా మొదలుపెట్టాడు.


"స్కూల్ రోజుల్లో ఏదైనా హోంవర్క్ చేయకపోయినా, టీచర్ చిన్న మాట అన్నా... అది ఇంటికి చేరకముందే ఈమె మా పేరెంట్స్‌కు ఉప్పు అందించేది. నేను దెబ్బలు తింటుంటే పక్కన నిలబడి వింత ఆనందంతో నవ్వేది. నా పర్సనల్ డైరీని, నా పుస్తకాలను నా అనుమతి లేకుండా తవ్వి తీయడం ఆమెకు ఒక అలవాటు.


"కాలేజీ రోజుల్లో నేను ఒక అమ్మాయిని ఇష్టపడి, నా మనసులోని మాటను ఒక ఉత్తరంలో రాసుకున్నాను. అది ఆ అమ్మాయికి చేరకముందే ఈమె చేతికి చిక్కింది. ఆ లెటర్‌ను నేరుగా తీసుకెళ్లి మా అమ్మ చేతిలో పెట్టింది. నా వ్యక్తిగత భావాలను కూడా ఈమె ఒక ఆయుధంగా వాడుకుని నన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టి ఆనందించింది."


"చదువు పూర్తయ్యాక నేను ఒక మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. అదే సమయంలో ఆమెకు ఒక చిన్న పదివేల రూపాయల ఉద్యోగం వచ్చింది. అది చూసుకుని ఎంత అహంకారమో! 'నువ్వు పనికిరాని వాడివి, నా సంపాదన మీద బతుకుతున్నావు' అంటూ ప్రతిరోజూ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేది. నేను ఒక పెద్ద లక్ష్యం కోసం కష్టపడుతుంటే, ఈమె ఆ చిన్న ఉద్యోగంతో నన్ను చిన్నచూపు చూస్తూ మానసికంగా కుంగదీసింది."


"నేను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే 'సోమరిపోతు' అని వెటకారం. ఒకవేళ పని చేస్తే 'నటశిఖామణి' అని కామెంట్స్. నేను కొత్తగా ఏదైనా హెయిర్ స్టైల్ మార్చుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా... ఏదో ఒక వంక పెట్టి నన్ను కించపరచడం ఆమెకు నిత్యకృత్యం. నాకంటూ ఒక వ్యక్తిగత ఇష్టం, ఒక పర్సనల్ లైఫ్ లేకుండా చేసింది."


మురళీ గొంతు ఇక్కడ కొంచెం గద్గదమైంది. "యువర్ ఆనర్, నాకు కథలు రాయడం, పెయింటింగ్ వేయడం అంటే ప్రాణం. నేను ఎంతో కష్టపడి ఒక నవల రాస్తుంటే, దానిని నేను లేనప్పుడు చించి చెత్త బుట్టలో వేసి వచ్చేది.. నా ఉత్సాహాన్ని నీరుగార్చేది. 

నేను రాత్రంతా కష్టపడి వేసిన పెయింటింగ్స్ లేదా స్కెచ్‌లను నేను లేని సమయంలో చెత్తబుట్టలో వేయడమో, లేదా ఎవరికీ కనిపించకుండా దాచేయడమో చేసేది."


"ఇది కేవలం అన్నా చెల్లెళ్ళ గొడవ కాదు యువర్ ఆనర్. ఇది నా వ్యక్తిత్వాన్ని చంపేయడానికి ఆమె చేస్తున్న నిరంతర ప్రయత్నం. నేను ఏది చేసినా ఆమెకు నచ్చదు, నేను ఏది చేయకపోయినా ఆమె ఊరుకోదు. ఆమె నా ఇంట్లో ఉన్నంత కాలం నేను ఒక స్వతంత్ర మనిషిగా బ్రతకలేను. అందుకే నాకు ఈ బంధం నుండి శాశ్వత మైన విముక్తి కావాలి. నాతో పాటు పుట్టింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు నా ఇంట్లోకి వచ్చేస్తాను.. ఏదయినా అనేస్తాను అనే హక్కు ఎవరిచ్చారు.. ."


మురళీ మాటలు వింటున్న కోర్టు హాల్‌లో ఒకరకమైన నిశ్శబ్దం అలుముకుంది. జడ్జి గారు కవిత వైపు చూశారు. ఆమె ముఖంలో ఇంకా అదే అహంకారపు నవ్వు ఉంది.


"కవిత గారు, మీ అన్నయ్య చెబుతున్న ఈ ఆరోపణల మీద మీ సమాధానం ఏమిటి?" అని జడ్జి గారు అడిగారు.


మురళీ చెప్పిన ఈ విషయాల మీద కవిత ఇచ్చే కౌంటర్ మరియు మురళీ జీవితంలోని మరో భయంకరమైన కోణాన్ని వినటానికి అందరూ ఎదురు చూస్తున్నారు. 


----

జడ్జి గారి ప్రశ్న వినగానే కవిత ఏమాత్రం తడబడలేదు. తన పట్టుచీర కొంగును సరిచేసుకుంటూ, మొహంలో ఒక రకమైన వితండవాదాన్ని నింపుకుని బోనులో నిలబడింది. ఆమె కళ్లలో మురళీ పట్ల గౌరవం కంటే, ఒక చులకన భావమే ఎక్కువగా కనిపిస్తోంది.

ఎపిసోడ్ 3: కవిత వెటకారం - "అంతా వాడి మంచికే!"

"చెప్పండి కవిత గారు, మీ అన్నయ్య చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలకి మీ సమాధానం ఏంటి?" జడ్జి గారు అడిగారు.

కవిత ఒక్కసారి గట్టిగా నవ్వింది. "యువర్ ఆనర్, వీడు చెప్పేవన్నీ వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. వీడు అడగడమే విడ్డూరం అనుకుంటే, మీరు దీన్ని సీరియస్‍గా వినడం ఇంకా విడ్డూరంగా ఉంది. వీడొక వేస్ట్ ఫెలో (Waste Fellow) అండీ! వీడికి ఏదీ చేతకాదు, అందుకే నా మీద ఇలాంటి ఏడుపు గొట్టు కబుర్లు చెబుతున్నాడు."

1. "నేను చెప్పింది అబద్ధమా?"

"టీచర్ కి చెప్పాను అంటున్నాడు కదా.. హోంవర్క్ చేయకపోతే పేరెంట్స్ కి చెప్పడం తప్పా? వాడు చెడిపోకూడదనే కదా నేను చెప్పింది. గాలికి తిరిగి చెడిపోతుంటే చెల్లెలిగా నేను చూస్తూ ఊరుకోవాలా? వాడు దెబ్బలు తింటే నేను నవ్వలేదు యువర్ ఆనర్, వాడికి బుద్ధి వచ్చిందేమో అని సంతోషపడ్డాను అంతే!"

2. "ప్రేమ లేఖల గురించి అంత సీనా?"

"ఆ లవ్ లెటర్ గురించి అంటారా? వీడి మొహానికి అసలు చదువే రాదు, మళ్ళీ ఈ లవ్ లెటర్లు ఒకటా? ఆ వయసులో ప్రేమో గీమో అంటూ టైం వేస్ట్ చేస్తుంటే, అక్కగా నేను అమ్మకి చెప్పి వాడిని దారిలో పెట్టాను. అది తప్పా? నేను చెబితేనే కదా వాడికి బుద్ధి వచ్చింది!"

3. "కళలు, గీతలు.. అంతా సోమరితనం!"

"నవలలు రాయడం, స్కెచ్‌లు వేయడం అంటే ఎవడికి ఉపయోగం? ఇవన్నీ టైం పాస్ పనులు. ఇంట్లో బాధ్యతలు పట్టించుకోకుండా ఆ కాగితాల మీద పిచ్చి గీతలు గీస్తుంటే, అవి పారేయక పూజిస్తారా? వీడు బద్ధకాన్ని 'క్రియేటివిటీ' (Creativity) అని పేరు పెట్టుకుని తప్పించుకుంటున్నాడు. అందుకే నేను ఆ కాగితాలను తీసేసి వాడిని పని మీద దృష్టి పెట్టమన్నాను."


4. వీడొక అతిగా ఊహించుకునే మనిషి యువర్ ఆనర్ (Over-sensitive). తోడబుట్టిన వాళ్ల మధ్య ఇవన్నీ సహజం. దీనికే కోర్టుకి రావడం అంటే అసలు వీడికి బుద్ధి ఉందో లేదో మీరే ఆలోచించండి."


కవిత మాటలు వింటున్న మురళీకృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ప్రతి దారుణాన్ని 'నీ మంచికే చేశాను' అనే ముసుగులో ఎంత అందంగా కప్పిపెడుతుందో చూసి అతనికి ఊపిరి ఆగిపోయినంత పని అయింది.


మురళీ తన లాయర్ వైపు చూస్తూ, 

"యువర్ ఆనర్, ఈమె మాటలే పెద్ద సాక్ష్యం. నేను ఏది చేసినా తన దృష్టిలో తప్పు. నా ఆనందం తనకి అనవసరం. నా వ్యక్తిత్వం తనకి ముఖ్యం కాదు. ఈ 'మంచి' అనే ముసుగులోనే నా జీవితాన్ని నాశనం చేసింది. నేను ఈమెకు అన్నగా ఉండలేను. ఈ రోజే నా శ్రాద్ధ కర్మలు నేను చేసుకుంటాను.. కానీ నాకు ఈమె నుండి విముక్తి కావాలి!" అని అరిచాడు.

కోర్టులో ఒక్కసారిగా నిశ్శబ్దం. మురళీకి తన చెల్లెలి మీద ఉన్న అసహ్యం ఏ స్థాయిలో ఉందో ఆ అరుపులో అర్థమైంది.


----

మురళీకృష్ణ గొంతులో వణుకు ఇప్పుడు ఆవేశంగా మారింది. జడ్జి గారి వైపు చూస్తూ, తన జీవితంలో జరిగిన అత్యంత దారుణమైన ఘట్టాన్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


"యువర్ ఆనర్, పెళ్లి సంబంధాలు చెడగొట్టడమే కాదు... ఒకవేళ పెళ్లయ్యాక అయినా నేను ప్రశాంతంగా ఉంటానని ఆశపడ్డాను. కానీ ఈమె రాక్షసత్వం అక్కడ కూడా ఆగలేదు," అంటూ మురళీ తన ఆవేదనను కొనసాగించాడు.


"ఎన్నో కష్టాల తర్వాత నాకు పెళ్లయింది. కానీ నా భార్యతో నేను గడిపే ప్రతి క్షణాన్ని ఈమె విషపూరితం చేసింది. ప్రతి నెలా ఏదో ఒక వంకతో మా ఇంటికి రావడం, నేను లేని సమయంలో నా భార్యకు నా గురించి అబద్ధాలు చెప్పడం ఈమెకు అలవాటు. 'మా అన్నయ్యకు బుద్ధి లేదు, వాడు చాలా నీచమైన వాడు, వాడిని నమ్మకు' అంటూ నా భార్య మనసులో నాపై అసహ్యం కలిగించడానికి నిరంతరం ప్రయత్నించింది. ఒక భర్తగా ఆమె కళ్లలో నాకున్న గౌరవాన్ని తగ్గించడమే ఈమె లక్ష్యం."


" ఏంటి వాన్ని పట్టుకొని ఏవండీ అంటావు వాని పేరు పెట్టి పిలు అంత గౌరవం అవసరం లేదు అని నా భార్యకే చెప్తోంది "


"ఒక పక్క బయట ప్రపంచంతో పోరాడి, మరోపక్క ఇంట్లో భార్యతో గొడవలు పోరాడి ఇంక నావల్ల కావడం లేదు ... వీటన్నిటికీ కారణం నా చెల్లెలు నా వ్యక్తిగత జీవితంలోకి చేసే చొరబాటు (Intrusion) హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చింది నాకు తెలియట్లేదు . నా భార్యకు, నాకు మధ్య దూరం పెంచి నేను ఒంటరివాడిని కావాలని ఈమె కోరుకుంటోంది. ఇది భరించడం నా వల్ల కావడం లేదు... యువర్ ఆనర్. ఇది కేవలం గొడవ కాదు, ఇది నా సంసారాన్ని కూల్చే కుట్ర. నేను ఇక ఎంతమాత్రం భరించలేను!"


తీర్పు : 


జడ్జి వెంకట్ రెడ్డి గారు మురళీ ఆవేదనను, కవిత నిర్లక్ష్యపు నవ్వును గమనించారు. ఆయన తన తీర్పును ఇలా వెలువరించారు:


> "రక్త సంబంధం అనేది గౌరవప్రదంగా ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను (Privacy), వైవాహిక జీవితాన్ని (Marital Harmony) నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు, అది తోడబుట్టిన వారైనా సరే."

 * శాశ్వత నిషేధం (Permanent Injunction): కవిత, మురళీకృష్ణ నివసించే ఇంటికి గానీ, అతని భార్యతో గానీ ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదని, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని కోర్టు ఆదేశించింది.

 * చట్టబద్ధమైన దూరం: మురళీకృష్ణ తన ఆస్తుల నుండి, తన బాధ్యతల నుండి కవితను శాశ్వతంగా తొలగించుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది. నేటి నుండి వారిద్దరి మధ్య ఎటువంటి సామాజిక బంధం ఉండదు.

 * శిక్ష హెచ్చరిక: ఒకవేళ కవిత మళ్లీ మురళీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే, అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, అప్పుడు ఆమెకు కఠిన జైలు శిక్ష విధిస్తామని జడ్జి గారు హెచ్చరించారు.


తీర్పు విన్న మురళీకృష్ణ భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. ముప్పై ఏళ్ల తర్వాత మొదటిసారి అతను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. కోర్టు హాల్ నుండి బయటకు వస్తుంటే, కవిత అరుపులు దూరం అవుతున్నాయి... మురళీకి ఇప్పుడు కొత్త జీవితం మొదలైంది.


--- సమాప్తం ----


44) బిజీ లైఫ్.. కథ

 బిజీ లైఫ్.. కథ 


15jan2026 

~~~~~~~~~~

✍️ హరీష్ బాబు 


      రాత్రి తొమ్మిది అయింది. ఊపిరి తీసుకోకుండా మీటింగ్స్ ఉంటూనే ఉన్నాయ్.. ఏమి వర్క్ ఫ్రొం హోమ్.. ఓ ఏమో కానీ ప్రాణాలు తోడేస్తున్నారు అనిపించింది. పైగా ఈ అజైల్ ప్రాజెక్ట్ అంటే..రాత్రి పడుకునే ముందు ఏమి చేసామో చెప్పాకా.. మళ్ళీ పొద్దున్న ఏమి ఉంటుంది అప్డేట్ స్టేటస్ నా బొంద.. 


   బెదురూమ్ లో నా ఆలోచనల లో నేనుంటే.. కిచెన్ లో ఏదో అలికిడి బినిపిస్తోంది.. 

ఏమిటా అని వెళ్లి చూస్తే మా చిన్ను గాడికి మళ్ళీ మార్కులు తక్కువ వచ్చాయి అని మా ఆవిడ అరుస్తుంది... 


   కాసేపు విన్నాక నేను కూడా కాస్త చెప్పి చూద్దాం అని శృతి కలిపాను... 

"ఏరా చిన్ను.. మీ అమ్మ నే కోసం పొద్దున్న ఇదింటికే లేసి టిఫిన్, బాక్స్ లు అన్ని సిద్ధం చేసి పంపుతోంది.. చదువుకోటానికి ఏంట్రా నొప్పి.. " 


ఆ లాజిక్ కరెక్ట్ కాదు అని నాకు తెల్సు.. కానీ మంచి చెడు చెప్పక పోతే ఎలాగ చేయి జారీ పోతాడేమో అని భయం..


మేము ఇద్దరం నోరు నొప్పి వచ్చేలా అరవటం ఏ కానీ వాడిలో ఏ స్పందన లేదు.. 


*** ****

. ఇది జరిగి వారం అయింది.. మళ్ళీ అవే అరుపులు.. 


చిన్నుకి మార్కులు తక్కువ వచ్చాయి అని.. 


కాసేపు వాడిని నిందించాము... కాసేపు స్కూల్ ని వాళ్ళ టీచర్స్ ని తిట్టిపోసాము.. అయ్యాక ఒకరిని ఒకరం నువ్వు పట్టించుకోవట్లేదు అంటే నువ్వు అంటూ కాస్త జగడం నడిచింది.. 


అలా ఒక గంట గడిచాక ఇల్లు అంతా నిశ్శబ్దం అలుముకుంది.. 


కుర్చీలో కూలబడి..దీర్ఘ ఆలోచనలో పడ్డాను.. 

నిజంగా చిన్ను తప్పు ఏమైనా ఉందా.. మన రోజుల్లో మనమే చదువుకున్నామా.. మన అమ్మానాన్న కూర్చోపెట్టి చదివించారా.. అని ఆలోచిస్తే.. నా రోజుల్లో అమ్మ నాన్న తమ సమయం ఎంత కేటాయించారో గుర్తొచ్చింది.. 


ఇప్పుడు ఒక్క నిమిషం దొరికితే ఫోన్ పట్టుకొని ఏదో వెతికేసే ప్రయత్నం లోనే అందరం ఉంటున్నాం.. ఆ డబ్బా లో ఏమి చావదు అని తెలిసినా మళ్ళీ ఆ ఫోన్ వైపే వేళ్ళు వెళ్ళిపోతుంటాయి తప్ప బాబుని కూర్చోపెట్టుకుని.


   "బాబు ఏంట్రా నీకు ఏమి ఇబ్బంది.. నేను చెప్పనా "అని చదువు చెప్పే ఓపిక నశించింది అని అర్ధం అయ్యింది...


  ఇంకా ఎవర్నో నిందించి ప్రయోజనం లేదు అని అర్ధం అయింది.. 


ఇక నుంచి రోజు ఒక గంట కచ్చితంగా బాబు చదువు కోసం వెచ్చించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను.. 


బాబు కూడా సంతోషాపడ్డాడు.. మనం బరిలోకి దిగితే వేరేలాగా ఉంటుంది అని నిరూపించాము.. 


వర్క్ బుక్స్ వదిలేసి.. టెక్స్ట్ బుక్ లో నుంచి నోట్స్ ఎలా రాసుకోవాలో నేర్పించాను...

ఫాస్ట్ గా కాకుండా స్లో గా ఎలా చదివితే బుర్రకి ఎక్కుతుందో చెప్పాను..


చూస్తూనే హాఫ్ ఇయర్లి ఎగ్జామ్స్ వచ్చాయి... నేను ఒకటే చెప్పను 


.. 1st ర్యాంక్ రావాలంటే .. 3 పాయింట్లు రాసుకో అని చెప్పను 


1) నాకు ఎంత టైమ్ ఉంది 

2)ఎన్ని చదవాలి ( ఓకే పేపర్ లో అన్ని నంబర్స్ వేసి ఉంచుకో ) 🔲

3) ఎన్ని చదవగలిగాను ( చదివిన వి అన్ని టిక్ ✅ చేసుకో ) 


అన్ని నంబర్స్ కి టిక్స్ ✅ వచ్చాయి అంటే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. అని 

అప్పుడు నువ్వు ఎగ్జామ్స్ సిద్ధం గా ఉన్నట్టు.. 


ఇప్పుడు చిన్ను మర్క్స్ తక్కువ వస్తాయా రావా అని భాధ పడట్లేదు.. ఎందుకంటే ఎన్ని వచునో ఎన్ని రావో ముందే తెల్సు కాబట్టి..


ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే.. చెప్పాడు.. తనకు మళ్ళీ మళ్ళీ మంచి మార్కులు వచ్చి నందుకు సెక్షన్ c నఃంచి సెక్షన్a కి మార్చారు అని సంతోషంగా... 


- --- సమాప్తం ----

Saturday, June 13, 2026

43) అంతా యాద్రుచ్చికం .. కథ

 


#telugustories 

 అంతా యాద్రుచ్చికం  .. కథ 

~~~~~~~~~~~~~~~~

✍️ హరీష్ బాబు 


ఒకసారి ఒక కంపెనీ ఇంటర్వ్యూ లాసం అని బెంగుళూరు కి వెళ్లాల్సి వచ్చింది.. కరోనా తరువాత ప్రయాణాలు తగ్గించాక చేసిన మొదటి ప్రయాణం అది 


ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ లో ఎన్ని సౌకర్యాలు ఉన్న  నేను మొదట్నుంచి ఇష్టపడేది మన rtc బస్సు ప్రయాణమే.. సురక్షితం ఏ కాక డ్రైవర్స్ కూడా అంత మోరటు గా మాట్లాడరు అందుకే ఎపుడు అవకాశం వచ్చినా rtc బస్సు ప్రిఫెర్ చేస్తుంటాను.. 


అలా ఆ రోజు కూడా హైదరాబాద్ బెంగళూరు బస్ ఎక్కి కూర్చున్నాను.. 


బస్సు సిటీ పరిసరాల్లో నెమ్మదిగా కదులుతోంది 

టీవీ పెడతాడేమో అని చూసా లేదు. ఎందుకు అంటే అందరూ ఫోన్లలో చూస్తున్నారు అన్నాడు కండక్టరు.. నేను అలాగే చూద్దాం అని ప్రయత్నించాను.. లాభం లేదు సౌండ్ వినపడట్లేదు ఇయర్ ఫోన్ వాడితే చెవి నొప్పి వచ్చే లాగా ఉంది.. పక్కన పడేసి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కిటికీ లోకి తొంగి చూస్తూ లోకం మరిచి పోయా.. 


బస్సు సిటీ దాటేసింది.. 


పక్క సీట్ లో ఇద్దరూ బీటెక్ బాబులు ఐపీయల్ మ్యాచ్ వీక్షిస్తూన్నారు..  నా దురదృష్టం ఆ రోజే అభిషేక్ సెంచరీ చేసాడట.. వారితో 


కాసేపు వారితో మాటలు కలిపా స్కోర్ ఎంత ఎక్కడ వెళ్తున్నారు.. ఏమి పని మీద..అడగ్గా వాళ్ళు ఇద్దరూ ఏదో ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తున్నట్టు చెప్పి మళ్ళీ మ్యాచ్ లో లీనం అయ్యి పోయారు.. 


బస్సు కాసేపాగాక ఒక చోట భోజనానికి ఆపాడు... యాస్ యుష్షుయల్ గా పరమ చెత్త చోట ఆపాడు.. 


దిగి కాసేపు ప్రకృతి ని పలకరించి వచ్చాను.. 


ఎటు ఆపాడు కదా తిన గలిగేవి ఏమున్నాయా అని చూద్దాం అని ఒక టేబుల్ వద్ద కుర్చున్నాను.. కాసేపట్లో మరో ఇద్దరూ పాసెంజర్స్ కూడా అదే టేబుల్ జోయిన్ అయ్యారు.. 


మాట మంతి కలిపాక... సర్వర్ వచ్చాడు ఆర్డర్ కోసం మా మధ్యలో కాస్త డిస్కషన్ ప్రారంభం అయింది.. బిర్యానీ తింటే బెటర్ అనో ఒకరు కాదు పెరుగన్నం బెటర్ నా మాట వినండి అని నేను.. కాదు మీల్స్ తీసుకుందాం అని పక్కన ఆయన చెప్పారు.. సరే తల ఒకటి తెప్పించుకున్నాం.. 


చివరికి తేలింది ఏమిటంటే వాటికంటే పెరుగన్నం ఏ కాస్త బాగుంది.. అని అందరూ నా వైపుకి చుసి.. ఇంకో కర్డ్ రైస్ ఆర్డర్ చేశారు.. వారిలో ఒకతను తను డాక్టర్ ని అన్నాడు.. ఏమి స్పెషలి్సేషన్ అనిడిగితే.. ఫిజియో తెరపి అన్నాడు.. ఓరిని ఫిజియో అని చేప్పకుండా డాక్టర్ అంటావా అనుకున్నా.. వీరిని కూడా డాక్టర్ అంటారు కాబోలు మనకు తెలీదు కదా.. 


అయితే అతను  తింటున్నపుడే 

"ఇక్కడ టీ ఉంటుందా" అని అడగటం గమనించాను.. 


"పెరుగన్నం తింటూ టి ఏంట్రా నీ బొంద" అనుకున్నాను మనసులో 


 అయితే అతను నేను మనసులో అనుకున్నట్టే అతను బయటికి వచ్చాక టీ ఆర్డర్ చేసాడు 


నేను ఇంక ఉండబట్టలేక 

"ఇప్పుడే పెరుగన్నం తిని అప్పుడే టీ ఏంటండీ... మీరేమో డాక్టర్ అంటున్నారు...  లోపల పెరుగు  టీ కలిసి విరిగి పోదా...  అని అడిగాను దానికి అతను ఇచ్చిన సమాధానం చూసి విస్తూ పోయాను..


". అంటే  టీ కి... పెరుగు కి మధ్యలో నేను కేక్ తిన్నాను" అని చెప్తున్నాడు


 అబ్బా ఏం కాంబినేషన్ రా నాయనా అనుకున్నా  మనసులో.. 


అలా టీ లు అయ్యాక బస్సు ఇంకొన్ని ప్రొఫెషనల్ కబుర్లు చెప్పుకుంటూ.. నిద్రపోయాం... 


పొద్దున్న లేచి బై బై చెప్పుకుంటూ ఎవరి స్టాప్ లో వారు దిగారు.. 

నా ఇంటర్వ్యూ అయిపోయేసరికి.. సాయంత్రం 4 pm అయింది ఇంకా ఎవరినైనా కలవటానికి టైమ్ లేదు కదా అని మేజీస్టిక్ బస్సు స్టాప్ కి చేరుకున్నాను ( ఇక్కడ mgbs అన్నట్టు బస్సు స్టాప్ ని అక్కడ అలా పిలిస్తారు లెండి ) వచ్చి హైదరాబాద్ వచ్చే మొదటి బస్సు ఎక్కేద్దాం అని డిసైడ్ అయ్యాను....


6 pm వరకు ఒక్క బస్సు లేదు.. అప్పుడు వచ్చింది.. ఆ బస్సు ఎక్కి చూద్దును కదా.. ఆశ్చర్యం.. పొద్దున్న వచ్చిన బస్సు డ్రైవర్ కండక్టర్ ఉన్నారు.. యాద్రుఛ్చికం.... 


దిగి బస్సు  చూసా.. అదే బస్సు.. యాద్రుఛ్చికం


సరే అని బస్సు లోకి వెళ్లి కూర్చున్నాను..  కిటికీ లోకి చూస్తూ 


"అరేయ్ అన్న రా.. " అన్నా అరుపు కి ఇటు తిరిగా 


ఎవరా అని చూస్తే.. నిన్న రాత్రి ipl మ్యాచ్ చూస్తున్న బీటెక్ బాబులు వచ్చారు..యాద్రుఛ్చికం


" ఓరిని మీరు కూడా ఇదే బస్ ఆ.. ఎగ్జామ్ అన్నారు కదా అయిందా " అని అడిగాను.  


" ఆ అయిపోయింది అన్నా.. ఇంకా వచ్చేసాం "


" ఓకే గుడ్"  అనుకున్నా.. 


కాసేపయ్యాక ఆ డాక్టర్ కూడా వచ్చాడు.. 


ఓరి నాయనో ఒకే బస్సు లో ఇంత మంది యాదరుచికంగా ఒకే బస్సు ఎలా ఎక్కరా అనుకున్నా.. 


ఎందుకంటే మాలో ఎవరూ కూడా రిజర్వేషన్ లేదు జస్ట్ ర్యాండమ్ గా వచ్చి కలిసాం.. 



జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటేనే.. జ్ఞాపకాలు గా మిగిలంటాయి అనిపించింది.. 


సమాప్తం.. 


-----  *** ----


49) గాలిలో కలిసిన గర్వం**.. కథ

 Story  **గాలిలో కలిసిన గర్వం**.. కథ  ✍️ Harish babu  హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఆ విమానంలో రాఘ...