Showing posts with label 54) దారులు దూరమైన వేళ. Show all posts
Showing posts with label 54) దారులు దూరమైన వేళ. Show all posts

Tuesday, July 7, 2026

54) దారులు దూరమైన వేళ

 దారులు దూరమైన వేళ

~~~~~~~~~~~~~

✍️హరీష్ బాబు 




శరణ్య ఫోన్ మోగింది. అవతలి నుంచి ప్రణయ్ గొంతు వినిపించింది.


"హాయ్ శరణ్య.. ఎలా ఉన్నావు?" అని అడిగాడు ప్రణయ్.


"హాయ్ ప్రణయ్, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?" అని శరణ్య సమాధానమిచ్చింది.


"ఏంటి, ఈ మధ్య ఆఫీసుకి రావడం లేదు?" అని ప్రణయ్ అడిగాడు.


"తర్వాత చెప్తాలే ప్రణయ్," అంటూ శరణ్య మాటను దాటవేసింది.


ప్రణయ్‌కి ఏమీ అర్థం కాలేదు. "సరే కానీ, నా పెళ్లి విషయం గుర్తుంది కదా? రేపు ఆదివారం, తప్పకుండా రావాలి. ఆఫీసులో చెప్పలేకపోయాను, అందుకే ఫోన్ చేశాను. నువ్వు, నీ ఫ్యామిలీతో కచ్చితంగా రావాలి, ఓకేనా?" అని ప్రణయ్ అడిగాడు.


"ఓకే, ఓకే తప్పకుండా వస్తాలే. సరే మరి బాయ్," అని శరణ్య ఫోన్ పెట్టేసింది.

కానీ పెళ్లి రోజు అందరూ వచ్చారు, శరణ్య మాత్రం రాలేదు. ఎందుకు రాలేదో ప్రణయ్‌కి అస్సలు అర్థం కాలేదు.


ప్రణయ్, శరణ్య ఆఫీసులో మంచి మిత్రులు. లంచ్ టైంలో శరణ్య తన ఇద్దరు కూతుళ్లు చేసే అల్లరి గురించి చెప్పే కబుర్లు ప్రణయ్ ఎంతో ఇష్టంగా వినేవాడు. అలాంటి స్నేహితురాలు పెళ్లికి రాకపోవడం, ఆ తర్వాత ఫోన్ ఎత్తకపోవడం అతడిని కలవరపెట్టింది. 


పెళ్లి తర్వాత రాధతో కొత్త జీవితం మొదలైనా, ఎక్కడో మూలలో శరణ్య ఎందుకు దూరమైందో అన్న ప్రశ్న ప్రణయ్‌ని వేధిస్తూనే ఉంది.


సుమారు ఆరు నెలల తర్వాత, ఒక రోజు హఠాత్తుగా శరణ్య నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ప్రణయ్ వెంటనే ఎత్తాడు. అసలు విషయం అప్పుడు తెలిసింది. తన పెళ్లికి వారం రోజుల ముందు శరణ్య ఉద్యోగం కోల్పోయిందని, ఆ బాధలో ఎవరికీ ముఖం చూపించలేక, ఏడుస్తూ అందరికీ దూరంగా ఉండిపోయానని ఆమె కన్నీళ్లతో చెప్పింది.


ఆ మాటలు విన్న ప్రణయ్ మనసు చలించిపోయింది. ఆమెను ఆ బాధ నుండి బయటపడేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుల సాయంతో ఆమె రెజ్యూమేని కొత్తగా తయారు చేశాడు. అనుభవం లేని చోట, తెలిసిన వారి ద్వారా ఎక్స్‌పీరియన్స్ లెటర్లు ఇప్పించి ఆమె ప్రొఫైల్‌ను పకడ్బందీగా సిద్ధం చేశాడు. అంతేకాకుండా, ఆమె నైపుణ్యం పెంచుకోవడానికి ఏయే కోర్సులు చేయాలో, ఏ ఇన్‌స్టిట్యూట్ బెస్ట్ అవుతుందో వివరంగా మార్గదర్శకత్వం చేశాడు.


చివరికి ప్రణయ్ పడిన శ్రమ ఫలించింది. శరణ్యకు ఒక పెద్ద కంపెనీలో మంచి హోదాలో ఉద్యోగం వచ్చింది.


ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఇద్దరూ ఒక కాఫీ షాప్‌లో కలిశారు. శరణ్య ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తోంది. తన సంతోషాన్ని పంచుకుంటూ, ఆ కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్‌ను ప్రణయ్‌కి చూపించింది. అతను ఆ లెటర్‌ను ఆసక్తిగా పరిశీలిస్తుండగా, అందులో ఉన్న జీతం వివరాలు చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆ జీతం తన జీతం కంటే దాదాపు రెట్టింపు ఉంది. ప్రణయ్ మనసులో ఒక రకమైన అభద్రతాభావం, అసూయ మెదిలాయి.

నిన్నటిదాకా ఉన్న జాలి ఇవాళ అసూయ గా మార్పు చెందింది.


 తన స్నేహితురాలి విజయం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ, ఆ సంఖ్యలు అతడిని లోలోపల కలవరపెట్టాయి.


కానీ ఆ తర్వాతే అసలు మలుపు తిరిగింది. కొత్త ఉద్యోగ బాధ్యతల్లో పడిన శరణ్య, తనను ఆ స్థితికి చేర్చిన ప్రణయ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. ప్రణయ్ ఎప్పుడు ఫోన్ చేసినా "బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను" అని చెప్పడం, ఆ తర్వాత అసలు తిరిగి కాల్ చేయకపోవడం అలవాటుగా మార్చుకుంది.


ప్రణయ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె నుండి స్పందన కరువైంది. ఎంతో విలువనిచ్చిన స్నేహం, హోదా మరియు డబ్బు ముందు చిన్నబోవడం చూసి ప్రణయ్ తీవ్ర వేదనకు లోనయ్యాడు.


కొద్ది రోజుల తర్వాత, ప్రణయ్ తన భార్యతో కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్ళాడు. అక్కడ ఒక మూల టేబుల్ వద్ద శరణ్య తన పాత కొలీగ్ కిరణ్‌తో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించింది. 


తను ఫోన్ చేసినప్పుడు "బిజీగా ఉన్నాను" అని చెప్పిన శరణ్య, తన పాత పరిచయస్తుడితో అంత సమయాన్ని కేటాయించడం చూసి ప్రణయ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఆ దృశ్యం చూశాక, శరణ్యకు తన పట్ల ఉన్నది కేవలం ఒక అవసరం మాత్రమేనని, తన స్నేహం ఇక ఎప్పటికీ పాత స్థితికి రాదని అతనికి అర్థమైంది.


 కొన్ని బంధాలు కేవలం ఒక దశ వరకేనని, మనుషుల ప్రయారిటీలు మారినప్పుడు పాత బంధాలు ఎంత సులువుగా కరిగిపోతాయో ఆ క్షణం ప్రణయ్ గ్రహించాడు.చివరకు, ప్రణయ్ మౌనంగా ఆ స్నేహానికి స్వస్తి పలికాడు.


 దారులు దూరమైన వేళ, కాలం మరియు హోదా మనుషుల మనసులను ఎంతలా మార్చగలవో ప్రణయ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు.


~~సమాప్తం ~~~


~~~~~~~~~~~~~


94 ) రోలింగ్ టైటిల్స్.. కథ :

  రోలింగ్ టైటిల్స్.. కథ :  ~~~~~~~~~~~~~~~~~~~ గగన్ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. గొంతులో వైవిధ్యం, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోయగల ప్రతిభ అతన...