Wednesday, April 1, 2026

39) మౌనం లోని ప్రేమ ... కథ

 మౌనం లోని ప్రేమ ... కథ 

--------------------------

✍️హరీష్ బాబు Harish Babu 


సుధాకర్ ఒక వర్ధమాన రచయిత. ప్రపంచాన్ని తన అక్షరాలతో చదవాలనుకునే వ్యక్తి.

ఇంగ్లీషులో ప్రావీణ్యం కోసం ఒక భాషా తరగతిలో చేరాడు. అతనికి అక్కడ రియా మాలిని అని ఒక అమ్మాయి చూసాడు . తను ఒక నర్సు గా పని చేస్తూ అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోటానికి వచ్చేది అని తెల్సుకొన్నాడు. ఆమె కళ్లు చాలా మాట్లాడతాయి కానీ, పెదవులు మాత్రం ఎప్పుడూ ముడుచుకునే ఉంటాయి. ఎవరితో ఎక్కువ పలికేది కాదు. 


    ఒకరోజు తరగతి విరామ సమయంలో సుధాకర్ ఆమె దగ్గరకు వెళ్లి,

 "హలో రియా గారు.. , నా పేరు సుధాకర్ నేను ఒక రైటర్ ని .. మీ పేరు ఎలా తెల్సు అని ఆశ్చర్య పోకండి.. మీరే కదా ఫస్ట్ క్లాస్ లో ఇంట్రడక్షన్ చేసుకున్నారు స్టేజి మీద "... 


"ఓహ్ హాయ్.. క్లాస్ లేదా ఇవాళ " 

"కాస్త లేట్ అట సార్.. అవును ఇంతకీ..మీరు ఏమి జాబ్ చేస్తుంటారు..? "

 " నేను హాస్పిటల్ లో నర్స్ ని అండి.. "


"నర్సింగ్ అంటే చాలా సేవతో కూడుకున్న వృత్తి కదా.. మీకు రోగులను చూసుకోవడం ఇష్టమేనా?"

 అని అడిగాడు. 


ఆమె తల ఎత్తి ఒక్క క్షణం అతడిని చూసి, సమాధానం చెప్పకుండా మళ్ళీ తన నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టింది. 


ఆమె మౌనం కాస్త ఇబ్బంది పెట్టినా సుధాకర్‌కి కి ఆవిడ ఒక అంతుచిక్కని నవలలా అనిపించింది.


ప్రతీరోజు ఆమెతో మాటలు కలిపే ప్రయత్నం చేసేవాడు. మాటల్లో ఆమె తన ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది అని తెలుసుకున్నాడు. 

   ఒకసారి రియా ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూ కి వెళ్తూ అడ్రస్ కనుక్కోటానికి ఇబ్బంది పడుతుంటే సుధాకర్ స్వయంగా తోడుండి ఆమెను ఆఫీస్ వరకు తీసుకెళ్లాడు. 

     

   దారిలో సుధాకర్ ఉత్సాహంగా, 

"రియా గారు, ఈ ఏరియా అంతా నాకు బాగా తెలుసు. మీకు ఇక్కడ జాబ్ వస్తే ట్రావెలింగ్ చాలా ఈజీ అవుతుంది. భయపడకండి, ఇంటర్వ్యూ బాగా చేయండి అల్ ది బెస్ట్ " అని ధైర్యం చెప్పాడు. 


   తీరా ఆఫీస్ దగ్గరకు రాగానే, ఆమె ఒక చిన్న 'థాంక్స్' కూడా చెప్పకుండా కేవలం తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. సుధాకర్ ఆశ్చర్యపోయాడు అయినా, 


  " ఏమో పాపం.. ఇంటర్వ్యూ టెన్షన్‌లో ఉండి ఉంటుందిలే" అని ఆమె ప్రవర్తనను అమాయకత్వంగా భావించి నవ్వుకున్నాడు.


   కొన్ని రోజుల తర్వాత, ఆమె తన ఊరికి వెళ్లడానికి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేయలేక ఇబ్బంది పడుతుండటం గమనించాడు , మళ్ళీ సుధాకరే దగ్గరుండి అన్నీ పూర్తి చేసి ఇచ్చాడు 


. "రియా గారు, ఇదిగోండి మీ కన్ఫర్మ్డ్ టికెట్. విండో సీటు వచ్చేలా చూశాను, జర్నీ ఎంజాయ్ చేయండి. వెళ్ళాక ఒకసారి ఈ అబాగ్యుడికి ఒక మెసేజ్ చేయండి," అన్నాడు ఆశగా.


    కానీ ఆ సమయంలోనూ ఆమె మౌనంగానే ఉంది. ఆ టికెట్ అందుకుని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది తప్ప, ఒక్క మాట కూడా మాట్లాడలేదు.


     చివరికి ఇంకోసారి తన స్నేహితులకి వీకెండ్లో బర్త్డే పార్టీ కోసం సరుకులు కొనడానికి అని రమ్మంది. వెళ్లినప్పుడు కూడా సుధాకర్ ఏదో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ మళ్ళీ అదే మౌనం. ఆమెకు భారీ సంచులు మోస్తూ ఆమె ఇంటి వరకు తీసుకొచ్చి సాయం చేశాడు.


 "అబ్బో! చాలా సరుకులు కొన్నారుగా.. పార్టీ పెద్దదే అనుకుంటా? మీ ఫ్రెండ్స్‌కి మీ వంట అంటే ఇష్టమా?" అని నవ్వుతూ పలకరించాడు. 


   కానీ రియా వైపు నుండి స్నేహం వైపు నుండి ప్రతిస్పందన గా ఒక్క అడుగు కూడా పడలేదు. సంచులు లోపల పెట్టి తలుపు వేసే వరకు ఆమె కనీసం అతని వైపు చూసి నవ్వు కూడా నవ్వలేదు కూడా. ప్రతిసారీ ఆమె ఒక అపరిచితురాలిలాగే ప్రవర్తించేది.


    ఇక విసుగు పుట్టిన సుధాకర్ బాధగా ఒకరోజు తన రూమ్ లో ఉండగా తన ప్రాణ స్నేహితుడు కృష్ణతో వచ్చాడు. విషయం ఏంటి అడగగా తన బాధను పంచుకున్నాడు. 


"రేయ్ కృష్ణ, నేను చేసిన సాయం తీసుకుంటుంది కానీ, కనీసం నేను మనిషిని అని కూడా గుర్తించదు.

అసలు తిట్టుకుంటుందా, ఎగతాలా,కోపమా, అసహ్యమా, ఇష్టమా ఏది తెలియదు రా అవసరానికి రమ్మంటుంది పనయ్యాక పొమ్మంటుంది. అంతా మౌనమే.. ఆ మౌనం వెనుక అర్థం ఏంటిరా ?" అని అడిగాడు.


కృష్ణ చాలా సేపు నిశ్శబ్దంగా విన్నాడు. 

అంతా విని ఇలా అన్నాడు: 


"సుధాకర్ ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకు.. ఆడవాళ్ల మౌనానికి చాలా అర్థాలు ఉంటాయి. తను నీ సాయం తీసుకుంటూ కూడా మాట్లాడట్లేదంటే దాని అర్థం..

 'దయచేసి నన్ను ఇంతకంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకు, నాకూ కాస్త దూరంగా ఉండు ' అని. అది ఆమె నిశ్శబ్ద హెచ్చరిక ఏమో ."


ఆ మాట సుధాకర్ కళ్ళు తెరిపించింది. తన ఉనికి ఆమెకు భారం అనిపించినప్పుడు అక్కడ ఉండటం వ్యర్థమని గ్రహించాడు, వెంటనే తన మకాంను వేరే కాలనీకి మార్చేశాడు. కనీసం తను వెళ్తున్న విషయం కూడా ఆమెతో చెప్పలేదు. 


కొన్ని వారాల తర్వాత, రియాకు సుధాకర్ తో మళ్ళీ ఒక అత్యవసరమైన పని పడింది. మునుపటిలాగే క్లాస్ లో చూసింది, కానీ అక్కడ సుధాకర్ సీటు ఖాళీగా ఉంది. ఆ తర్వాత రెండు మూడు రోజులు గడిచినా అతను రాలేదు. 


    మొదటిసారి రియా మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. తను పిలవకపోయినా పలకరించే గొంతు వినిపించకపోయేసరికి ఆ నిశ్శబ్దం ఆమెను భయపెట్టింది.


ఆమె ఎలాగోలా సుధాకర్ పాత ఇంటి చిరునామా వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ ఇంటి యజమానిని కలిసి, "ఇక్కడ సుధాకర్ అని ఒక రచయిత ఉండేవారు.. ఆయన ఏరి?" అని అడిగింది.


    ఆ యజమాని బదులిస్తూ, "ఆయన ఇక్కడ ఉండటం లేదు ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. 

తన సామాన్లన్నీ సర్దుకుని వెళ్తూ వెళ్తూ 


'ఈ ఊర్లో నా అక్షరాలు ఎవరికీ అర్థం కావడం లేదు, అందుకే కొత్త చోటుకి వెళ్తున్నాను' అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలకి అర్ధం నాకు తెలీలేదు . ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికీ చెప్పలేదు," అన్నాడు గేట్ వేసుకుంటూ .


   రియా ఆ ఇంటి గేటు దగ్గరే ఆ రూమ్ డోర్ వైపు చూస్తూ అలా నిలబడిపోయింది. అప్పుడు ఆమెకు కృష్ణ గుర్తుకు రాలేదు కానీ, సుధాకర్ పలకరింపులు మాత్రం చెవుల్లో మారుమోగాయి.


"రియా గారు, ఈ హాస్పిటల్ మీకు నచ్చుతుంది..." "రియా గారు, మీ టికెట్ వచ్చేసింది..." 

"రియా గారు, పార్టీ బాగా చేసుకోండి..."


   అతను ఆమె 'మౌనం' కి అర్ధం 'దూరం' అనుకుంటాడని ఆమె ఊహించలేదు. నిజానికి ఆమెకు మాట్లాడటం రాక కాదు, అతని మంచితనం చూసి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. 

   ఆ ఎక్కడికి వెళ్తాడు లే అన్న నిర్లక్ష్యం లో తమ క్లాస్ కేవలం రెండు నెలలే అన్న విషయం మర్చిపోయింది. 

 నిజమే తన నిశ్శబ్దం నిర్లక్ష్యం గా మారి ఒక మంచి స్నేహాన్ని చిదిమేసింది.


(మిగతాది పార్ట్ - 2 లో ) 


**** ***** ****

మౌనం లోని ప్రేమ

(లాస్ట్ పార్ట్ - 2 ) 


**** ***** ****


ఆమె చేతిలో ఉన్న పాత ఫోన్ నంబర్‌కి డయల్ చేసింది. కానీ అటువైపు నుండి "ఈ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేదు" అన్న సమాధానం మాత్రమే వచ్చింది. ఒక రచయిత తన కథలో అనవసరమైన పాత్రలను తొలగించినట్టుగా, సుధాకర్ ఆమె జీవితం నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు. రియా మాలిని ఇప్పుడు నర్స్ గా అందరి రోగాలను నయం చేస్తోంది కానీ, తన మౌనం వల్ల కలిగిన ఆ మనసు గాయాన్ని మాత్రం మాన్పుకోలేకపోయింది.


------------


మౌనానికి మరో రూపం - త్యాగం

కొన్ని నెలల తర్వాత...


అంబులెన్సు కూత తో హాస్పిటల్ మర్మోగుతోంది.. 

రియా మాలిని పనిచేస్తున్న హాస్పిటల్ లోకి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. స్ట్రెచర్ మీద రక్తపు మడుగులో ఒక వ్యక్తి అడ్మిట్ చేస్తున్నారు.. అటుగా వెళ్తున్న రియా స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తిని చూడగానే గుండె ఆగినంత పనైంది. 

అతను ఎవరో కాదు... సుధాకర్. పక్కనే అతని ఫ్రెండ్ కృష్ణ.. కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.


   ఐసీయూ లో ఊపిరి పీల్చుకుంటున్న సుధాకర్ ను బయట డోర్ అద్దాల లో నుంచి చూస్తూ కృష్ణను కలిసి అసలు ఏం జరిగిందో అడిగింది రియా.


  "హాయ్.. నా పేరు రియా .. అతనికి మీరేమవుతారు.. ఎలా జరిగింది ఇదంతా.. " 


   "ఓహ్ రియా మీరా.. రోడ్డు ప్రమాదం మేడం .. చాలా రక్తం పోయింది. తను కోలుకోవాలంటే అర్జెంట్‌గా ఓ నెగటివ్ గ్రూప్ బ్లడ్ కావాలి, ఎక్కడా దొరకడం లేదు" అని కృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు


.ఏమాత్రం ఆలోచించకుండా రియా , "నాది అదే బ్లడ్ గ్రూప్.. నా రక్తం తీసుకోండి" అని ముందుకు వచ్చింది రియా.


   సుధాకర్ కోలుకోవడానికి పట్టిన ఆ 24 గంటలు రియా అసలు కనురెప్ప వేయలేదు. నర్సుగా తన డ్యూటీ మాత్రమే కాదు, ఒక స్నేహితురాలిగా అతనికి ప్రాణం పోసింది.


   కానీ, ఆమె కృష్ణతో ఒక మాట చెప్పింది:

 "కృష్ణ గారు, సుధాకర్ కి నేను ఎవరో చెప్పకండి. నేను సాయం చేశానని తెలిస్తే అతను మళ్ళీ నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. తను కోలుకుని వెళ్ళిపోయే వరకు నా పేరు తెలియనివ్వకండి. అడిగితే నా పేరు మాలిని అని చెప్పండి "


కొన్ని రోజుల తర్వాత సుధాకర్ కోలుకున్నాడు. డిశ్చార్జ్ అయ్యే సమయం వచ్చింది. కృష్ణ సాయంతో నడుచుకుంటూ హాస్పిటల్ కారిడార్ లో వెళ్తుంటే, రియా దూరం నుండి ఒక కర్టెన్ వెనుక నిలబడి తడి కళ్లతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. అతను క్షేమంగా తిరిగి వెళ్తున్నాడనే తృప్తి ఆమె మౌనంలో ఒక ప్రశాంతతను నింపింది.


బయటకు వెళ్తున్నప్పుడు సుధాకర్ ఆగి కృష్ణతో అన్నాడు, "కృష్ణ, ఎవరో నర్సు నాకు ప్రాణం పోశారట కదా.. రక్తం ఇచ్చి రాత్రంతా నిద్రలేకుండా చూసుకున్నారట. కనీసం థాంక్స్ చెప్పనివ్వు."


కృష్ణ నవ్వి, "ఆమె పేరు మాలిని. చాలా మంచి ఆవిడ. కానీ తను ఎవరితోనూ మాట్లాడదు సుధాకర్. తన సేవలోనే దైవత్వాన్ని వెతుక్కుంటుంది. నువ్వు తనకి థాంక్స్ చెప్పడం కంటే, క్షేమంగా ఇంటికి వెళ్లడమే ఆమెకు పెద్ద బహుమతి అని చెప్పమంది రా పైగా ఇవాళ డ్యూటీ అయిపోయింది.. పద వెళ్దాం.. " అన్నాడు.


సుధాకర్‌కు ఆ 'మాలిని' తనే అని తెలియదు. రియాకి మాత్రం తన మౌనం వెనుక ఉన్న ప్రేమని మాటల్లో చెప్పడం కంటే, ఇలా ప్రాణం పోసి నిరూపించుకోవడమే సరైనది అనిపించింది. ఆమె అక్షరాలు మౌనంగా ఉన్నా, ఆమె చేసిన సాయం సుధాకర్ ఊపిరిలో నిలిచిపోయింది.


------------


 - మధురమైన కలయిక 


సుధాకర్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ నర్సు 'మాలిని' చేసిన సేవ గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈరోజుల్లో కూడా అలాంటి మనుషులు ఉంటారా.. తన రక్తం ఇవ్వటమే కాకుండా తను డిశ్చార్జ్ అయ్యే వరకు సేవ చేయటం అంటే మాములు విషయం కాదు.. 


   ఒకరోజు తన రూంలో.. పాత సామాన్లు సర్దుతుండగా, భాషా తరగతిలో రియా మర్చిపోయిన ఒక పుస్తకం అతని చేతికి చిక్కింది. దాని మొదటి పేజీ మీద "రియా మాలిని" అని రాసి ఉంది.


ఒక్కసారిగా సుధాకర్ మెదడులో మెరుపు మెరిసింది. "కృష్ణ చెప్పిన నర్సు పేరు మాలిని... ఈమె పేరు రియా మాలిని! అంటే నాకు ప్రాణం పోసింది ఆమేనా?" అని కృష్ణకు ఫోన్ చేసి నిలదీశాడు. 


కృష్ణ నిజం ఒప్పుకోక తప్పలేదు. వెంటనే సుధాకర్ హాస్పిటల్‌కు పరుగెత్తాడు. కానీ అక్కడి రిసెప్షన్ లో అతనికి ఒక చేదు వార్త వినిపించింది


. "మాలిని గారు ఆ ముందు రోజే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత ఊరికి వెళ్ళిపోయారు" అని చెప్పారు.


సుధాకర్ వదిలిపెట్టలేదు. తన రచయిత మెదడుతో, అక్కడ రికార్డుల ద్వారా ఆమె అడ్రస్ సంపాదించాడు. అది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామం. రైలు, బస్సు, కారు అన్ని విధాలుగా ప్రయాణాలు చేసి చివరకు ఆ పచ్చని పొలాల మధ్య ఉన్న ఆ ఊరిలో ఆమె ఇంటిని చేరుకున్నాడు.


రియా ఇంటి ముందు చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. అకస్మాత్తుగా సుధాకర్‌ను చూడగానే ఆమె కళ్లలో ఆశ్చర్యం, సంతోషం ఒక్కసారిగా ఉప్పొంగాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది, కానీ ఈసారి ఆమె మౌనం "ఎందుకు వచ్చావు?" అని అనడం లేదు, "నీ కోసమే వేచి చూస్తున్నాను" అని చెబుతోంది.


సుధాకర్ ఆమె దగ్గరకు వెళ్లి, "నీ మౌనం వెనుక ఇంత ప్రేమ ఉందని నాకు తెలియదు రియా. నన్ను క్షమించు," అన్నాడు. రియా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్షణం మాటల అవసరం లేకుండానే వారిద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు.


"ఇంకా మౌనమేనా మాట్లాడు అన్నాడు.. " 


"ఆమ్మో ఈ మౌనం తోనే నిన్ను పోగుట్టుకున్నాను.. ఇంక నుండి.. నా నోరు నిద్ర పోయే టప్పుడు తప్ప పలుకుతూనే ఉంటుంది.. నీ పేరే.. "


ఆ మౌన రాగం చివరకు ఒక అందమైన పెళ్లి పాటగా మారింది. సుధాకర్ అక్షరాలు, రియా సేవ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు.


 వారిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాటల మీద ఆధారపడాల్సిన అవసరం లేని మధురమైన బంధంలో ఉన్నారు.


*** శుభం ***


No comments:

Post a Comment

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...