Wednesday, May 7, 2025

ఆకలి పాఠాలు.. కథ

 ==================

ఆకలి పాఠాలు.. కథ
==================
అవి నేను పీజీ పూర్తి చేసి జాబ్ ప్రయత్నాలలో ఉన్న రోజులు... ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత ఒక్క జాబ్ వచ్చింది.. ముందు హైదరాబాద్ పోస్ట్ అన్న కంపెనీ వాళ్ళు సడన్ గా ఆఫర్ ఇచ్చేటప్పుడు పూణే లో పోస్టింగ్ ఇచ్చారు.
మరి ఏమి చేస్తాం.. జాబ్ దొరకటమే కష్టంగా ఉన్న రోజుల్లో అండమాన్ అయినా పర్లేదు అని ఫిక్స్ అయిపోయిన రోజులు .. తోటి క్లాసుమేట్స్ ఏ పెర్చెంటేజ్ లేకపోయినా రిఫరెన్స్ తో మంచి జాబ్స్ కొట్టేస్తునన్న రోజులు...నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఖాళీ గా ఉంటావ్ ఏమి... అని ఇంట్లో వాళ్ళు పూట పుటా దెప్పుతున్న రోజులు... సరే అని ఇష్టం లేకపోయినా తలడించి ఆఫర్ తీస్కొని ఇంటికి వచ్చా...
మరి పూణే వెళ్ళి ఎక్కడ ఉండటం ఏంటి చేయటం...అని ఆలోచిస్తుంటే మా బ్రదర్ వాళ్ళ కొలిగ్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడట పూణేలో.... అతని రూమ్ లో జాయిన్ అవ్వు మెల్లగా సెటిల్ అయ్యాక రూమ్ మారచ్చు అన్నాడు.. సరే అని సండే మార్నింగ్ రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకొని బస్సు ఎక్కాను....
తెల్లవారింది...బస్సు దిగి ఆటో పట్టుకొన్నా...జాన్ అనే అతని రూముకి వెళ్ళా... లోపలికి వెల్దునా.... దేవుడా...అది రూమ్ కాదు ...రైల్వేస్టేషన్.... పది మంది ఉంటున్నారు...ఆకలి రాజ్యం సినిమాని నాకు నిజంగానే చూపించారు
ఇంకా తప్పేదేముంది జాబ్ జాయినింగ్ ఆ మరుసటి రోజే కదా.... అక్కడే ఉన్నాను., ఇంకా ఆ రూమ్ లో చుస్తే అన్ని "రూల్స్ "యే ...
ఏమైనా తినాలంటే అందరికి పెట్టాలి... పోనీ వండుకుందామంటే వాళ్లే వండాలంట... వాళ్ళు తినేటప్పుడే మనం తినాలాట... ఒక రోజు మొత్తం నరకం చూసా.. పోనీ బయట తిందాం అంటే పూణే అప్పుడు కి ఇంకా అంతా డెవలప్ కాలేదు ఒక్క వాడప్పావ్ తప్ప...ఇడ్లి దోస..ఏమి దొరకదు.. వాడప్పావ్ ఏమో మనకి దిగదు
ఎలాగో పొద్దున్న ఆఫీస్ జాయిన్ అయ్యా మొత్తానికి... అక్కడే కాంటీన్ లో టిఫిన్, భోజనం చేసేశా... ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నా... కానీ అక్కడ డిన్నర్ ఉండదట..
మరేం చేయటం... రూమ్ లో మళ్ళీ ఆ వెయిటింగ్ చూసే ఓపిక నాకు లేదు... సరే ఏమైనా సరే బయటే తిని వెళ్దాం అనుకోని...సరే ఇంత పెద్ద నగరం లో తింటానికి ఏదో ఒకటి దొరక్క పోతుందా అని అనుకుంటూ..రోడ్ పక్కగా నడవటం మొదలుపెట్టాను...
అప్పటికి పూణే పెద్దగా డెవలప్ కాలేదు... ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటే ఇంకో కిలోమీటరు వరకు ఖాళీ రోడ్ ఏ ఉంటుంది... పైగా దుమ్ము ఎక్కువ... అలా ఆ చీకటిలో, ఆ దుమ్ములో, ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచాక... కూడా ఏ హోటల్ కానీ టిఫిన్ సెంటర్ కానీ కనిపించడం లేదు... ఏమి చేయటం ఆ అని ఆలోచిస్తుంటే... ఆ పక్కన ఒక్క చిన్న గుడిసె కనిపించింది... వాళ్ళని అడిగితె ఏమైనా చెప్తారేమో హోటల్ ఎంత దూరం అని...(అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్, మాప్స్ లేవు లెండి )
"హలో కోయి హాయ్ భాయ్ "
(ఎవరైనా ఉన్నారా ) అని నాకు వచ్చిన హిందీ లో పిలిచా...
వాళ్ళు లోపలికి రమ్మనట్టు సైగ చేసారు
లోపల చిన్న లైట్ ఉంది.... ఒకావిడ చపాతీ కలుస్తోంది... ఇంకో అతను ఆవిడా భర్త అనుకుంట.. పక్కనే కూర్చున్నాడు...నన్ను కూర్చోమన్నారు...
నేను మొహమాట పడుతుంటే... ఏమి పర్లేదు అని రమ్మని సైగ చేశారు... ఏంటో చెప్పామన్నారు..
"ఇక్కడ దగ్గరలో ఏదయినా హోటల్ ఉందా " అని అడిగా...
"నువ్వు రెండు మూడు కి. మీ. నడిచి ఉంటావ్ అలిసి పోయింటావ్ నీళ్లు తాగు" అని ఇచ్చారు.,
తాగాను.... అలసి ఉన్నా కదా
"ఇక్కడ హోటల్స్ ఏవి ఉండవు బాబు .. వాడప్పావ్ ఉంటుంది అది ఇక్కడ దొరకదు " అని చెప్పారు
మళ్ళీ వాళ్లే చెప్పారు.. "చూస్తే చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్టున్నావ్.. ఒక పని చెయ్యి.. నువ్వు మా తోనే తినేసేయి.. ఇంకో నాలుగు చపాతీ చేస్తాను.. " అందీ వాళ్ళావిడ...
నేను ఆ క్షణం లో ఏమి ఆలోచించానో తెలీదు కానీ
"సరే " అలాగే అన్నాను..
చపాతీ చేసి కూర వేసి ప్లేట్ లో ఇచ్చారు ఇద్దరు...
నేను తిన్నాను.. మధురం గా ఉంది...నేను తిన్న బెస్ట్ మీల్స్ అదే ఏమో అనిపించింది...
వాళ్ళు చూస్తే పెద్ద జాతి వాళ్ళలాగా లేరు.. మంచి ఇల్లు కాదు .. కూలి చేసుకుండే వాళ్ళ లాగా ఉన్నారు.. కానీ ఆ క్షణం నాకు అవన్నీ గుర్తు రాలేదు..నా ఆకలే మాత్రమే గుర్తొచ్చింది
.... ఆకలి కి జాతి , మతం, ఉచ్చమ్ నీచం తెలీదు.. ఆకలి కి ఒకటే తెలుసు ఆకలి తీరటానికి కాస్త ఆహారం....అంతే
చేతులు కడుక్కుని...వెళ్లేముందు.. నా జేబులోనుంచి ఒక 100 రూపాయలు ఇవ్వబోయా ను .. అప్పుడు వాళ్ళ మాట విన్నాక నేను ఎంత సంస్కార హీనున్ని అనిపించింది
"మా ఇంటికి తినే సమయంలో ఎవరు వచ్చినా అతను మాకు అతిధి లాంటివాడు.. భగవంతుడు మా విలువల్ని అప్పుడప్పుడు పరీక్షించటానికే నీలాంటివాళ్ళని పంపుతుంటాడు... కానీ మేము ఎప్పుడు ఓడిపోలేదు... అతిధిదేవోభవ అన్నారు కదా "...అన్నారు
ఆకలి మనకి మన పుస్తకాల్లో లేని ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తుంది...
ఇంకా చెప్పాలంటే మన పిల్లల్ని ఆకలితో నెలకి ఒక్కసారైనా... దేశ సంచారం చేసి రమ్మని చెప్పాలి.. అప్పుడే మనుషుల గురించి విలువల గురించి వాళ్లే మనకు చెబుతారు...
// సమాప్తం //

No comments:

Post a Comment

42 ) ఆశ కథ

 ఆశ - (chinna katha ) “గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ” అంటూ శర్మ గారు క్లాస్ మొదలు పెట్టారు. అతను చెప్తున్నది తొమ్మిదవ తరగతి మ్యాథమెటిక్స్ క్లా...